కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 13 : మెరుగైన పనితీరుతోనే గుర్తింపు వస్తుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి సూచించారు. జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్తున్న పలువురు జిల్లాస్థాయి అధికారులకు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో వీడ్కోలు పలికారు. ఇందులో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఐఏఎస్‌గా గతంలో ఎన్నో జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కరీంనగర్ జిల్లాలో పనిచేసిన కాలం తనకు చిరకాలం గుర్తుండిపోతుందన్నారు.
జిల్లాలో చేపట్టే ఏ కార్యక్రమమైనా అధికారులంతా స్నేహభావంతో బృందంగా ఏర్పడి ఎలాంటి రిమార్కులు లేకుండా వందశాతం సక్సెస్ చేస్తారని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులంతా సమయంతో సంబంధం లేకుండా వారికి అప్పగించిన పనులు సకాలంలో పూర్తిచేసి, విజయవంతం చేశారని చెప్పారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేయడంలో జిల్లా అధికారయంత్రాంగం ముందుంటుందని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ జరగడం సర్వసాధారణమని చెప్పారు. జిల్లా అధికారులంతా కలిసికట్టుగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ ప్రత్యేకతను చాటడం అభినందనీయమన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న అధికారులు డీపీవో వీరబుచ్చయ్య, జడ్పీ సీఈవో పవన్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, డీవైఎస్వో రాజవీరు వారి సర్వీసులో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. చివరగా కలెక్టర్, ఇతర అధికారులు వారిని శాలువాలతో సన్మానించి, వారి ఫొటో పెయింటింగ్ మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్, సీపీవో కొమురయ్య, మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా పరిశ్రమల అధికారి నవీన్, డీడబ్ల్యూవో సరస్వతి, ఇతర శాఖల అధికారులు నతానియేల్, సురేశ్, టీ వెంకన్న, హార్టికల్చర్ జేడీ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, డీపీఆర్వో కలీం పాల్గొన్నారు.