జమ్మికుంట/ ఓదెల, నవంబర్24: చెక్‌డ్యాం ధ్వంసమైన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఎలా నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. జమ్మికుంట మండలం తనుగుల, ఓదెల మండలం గుంపుల సరిహద్దు మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం శుక్రవారం రాత్రి ధ్వంసం కాగా, ఇంజినీరింగ్ అధికారుల ఫిర్యాదుతో జమ్మికుంట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. చెక్‌డ్యాం నాణ్యతా లోపంతో కూలిపోలేదని ఇరిగేషన్ డీఈఈ రవి ఇచ్చిన ఫిర్యాదుతో టెక్నికల్ ఆధారాల కోసం స్టేట్ ఎఫ్ఎస్ఎల్ ఏడీ వెంకట్రాజం ఆధ్వర్యంలో క్లూస్‌టీంను ఏర్పాటు చేశారు.
సోమవారం హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిఫుణుల బృందంతో కలిసి కలెక్టర్, సీపీ చెక్‌డ్యాంను పరిశీలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ రాజ్ నేతృత్వంలోని బృందం, కరీంనగర్ క్లూస్ టీం సభ్యులు, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్లు రాజు, స్వర్ణజ్యోతి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గంటపాటు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సాంకేతిక నిపుణులు శాంపిల్స్ సేకరించారని, ప్రయోగశాలలో అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత చెక్‌డ్యాం ధ్వంసం ఎలా జరిగిందనేది తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు.
తనిఖీల్లో ఇరిగేషన్ డీఈఈ రవి, ఏఈ శ్రావణ్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐలు రామకృష్ణ, లక్ష్మీనారాయణ, ఎస్ఐలు శేఖర్ రెడ్డి, ఆవుల తిరుపతి, సతీశ్, యూనస్(హుజూరాబాద్), అధికారులు, సిబ్బంది ఉన్నారు.