కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 16 : 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్‌లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వేదికగా మారింది. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇతర ప్రభుత్వ అధికారులు, విద్యార్థులతో కలిసి బధిర భాషలో జాతీయ గీతాన్ని ఆలపించి మూగ మనసులపై తమకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. దివ్యాంగుల్లో భాగమైన బధిరులు సమాజంలో అనేక ఇబ్బందులెదుర్కొంటుండగా, వారి సమస్యలను గమనించిన కలెక్టర్ పమేలా సత్పతి వాటిని పరిష్కరించే క్రమంలో అధికారులకు ఇండియన్ సైన్ లాంగ్వేజీ బేసిక్స్‌పై ఆశ్రయ్ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం ద్వారా కలెక్టరేట్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇప్పించారు.
వారం రోజుల పాటు జిల్లాలోని గెజిటెడ్ అధికారులతో పాటు రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, విద్య, జిల్లా పరిషత్, వైద్య, మున్సిపల్, డిఆర్డిఏ, మెప్మా, నెహ్రూయువకేంద్ర, జిల్లా గ్రంథాలయ, టీజీఎస్ఆర్టీసీ, జిల్లా యువజన, క్రీడా ప్రాధికార సంస్థ, అగ్నిమాపక శాఖ, ఎంప్లాయిమెంట్ సిబ్బంది మొదటి బ్యాచ్ కింద ఈ శిక్షణలో తర్ఫీదు పొందారు. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న బధిరులు వాటి పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తుండగా, ప్రస్తుతం వాటిని సులువుగా తెల్సుని, పరిష్కరించటంలో చొరవ చూపుతున్నారు. దీంతో, తమ ఇబ్బందులు పరిష్కరిస్తున్న అధికారులు పట్ల బధిరులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తుండగా, తమ ఇబ్బందులు వెంటనే తీరుతుండగా వారిలో హర్షం వ్యక్తమవుతున్నది.
అయితే, సైగల భాషకు విస్తృత ప్రాచుర్యం కల్పించే క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఎదుట సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతం ఆలపించేందుకు నిర్ణయించి, స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం జిల్లాలోని బ్యూరోక్రాట్లతో పాటు సైగల భాష ప్రాథమిక అంశాల్లో శిక్షణ పొందిన జిల్లా అధికారులు, జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బధిర ఉద్యోగులు, బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతం ఆలపించారు. ఈ గీతాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఇతర ప్రజాప్రతినిధులు అధికారుల వద్దకెళ్ళి అభినందించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న కేవలం నోటి మాట రాక వివక్షకు గురవుతున్న బధిరులకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం సైన్ లాంగ్వేజీతో ఆదరువునిచ్చినవ్వటం ఆదర్శనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.