కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 14: ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఎవరికి డెంగ్యూ నిర్ధారణ అయినా భయపడాల్సిన అవసరం లేదని, దవాఖానలో పూర్తి స్థాయిలో చికిత్స అందుతుందన్నారు. అవసరమైన వారికి ప్లేట్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లా దవాఖానలో అరకొర వైద్య సేవలు, మందులు, బెడ్స్ కొరత, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘సర్కారు దవాఖానకు సుస్తీ’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, కలెక్టర్ స్పందించారు. ఉదయం 11గంటల ప్రాంతంలో దవాఖానను సందర్శించారు. గంట పాటు వార్డులను పరిశీలించి, రోగులను ఆప్యాయంగా పలుకరించారు. అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఓపీలు చూస్తున్న వైద్యులు, ల్యాబ్ వద్దకు వెళ్లి సేవలు, వసతుల గురించి ఆరా తీశారు.
మెరుగైన సేవలు అందించాలని, వార్డుల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆరోగ్య సూత్రాలను ప్రదర్శించాలని సూచించారు. బ్లడ్ బ్యాంకులోకి వెళ్లి రోజుకు ఎంతమందికి బ్లడ్ యూనిట్లు అందిస్తున్నారని, ఎస్డీపీలు, ఆర్డీపీలు ఎన్ని సరఫరా చేస్తున్నారని ఇన్చార్జి డాక్టర్ ఉషా ఖండల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. ప్రైవేట్ దవాఖానల్లో డెంగ్యూ నిర్ధారణ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానలోనే డెంగ్యూ నిర్ధారణ చేస్తారని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు సమీపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిపూర్ణమైన ఆహారం తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎంహెచ్వో సుజాత, సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి, ఆర్ఎంవోలు నవీన, శోభ, వైద్యులు ఉన్నారు.