బీఆర్ఎస్ నేతలపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వాహనంపై దాడికి నిరసనగా శనివారం కరీంనగర్ బంద్‌కు పిలుపునివ్వగా, ఉదయాన్నే నగరాన్ని దిగ్బంధించి ఎక్కడికక్కడ పార్టీ నేతలను నిర్బంధించింది.
శాంతియుత బంద్ అని చెప్పినా వినకుండా అత్యుత్సాహం చూపింది. వారిపై ఉక్కుపాదం మోపి, అడుగడుగునా అణచివేసింది. నగరంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బయటికి రాకుండా అడ్డుకొని తర్వాత అరెస్ట్ చేసి, ఆయనతోపాటు చాలా మంది ముఖ్యనేతలు, నాయకులను అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించగా, గులాబీ దళం భగ్గుమన్నది. పోలీసుల తీరుకు నిరసనగా పలు చోట్ల ధర్నాలు చేసింది. కాగా, ఎన్ని నిర్బంధాలు కొనసాగినా నగర బంద్ సక్సెస్ అయింది. వ్యాపారులు, వాణజ్య సముదాయాలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేయగా, జిల్లా కేంద్రం వెలవెలబోయి కనిపించింది.
కరీంనగర్ కార్పొరేషన్/కమాన్‌చౌరస్తా/తెలంగాణచౌక్/కలెక్టరేట్, మే 9 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన బంద్‌పై పోలీసుల అణచివేత కొనసాగింది. శనివారం ఉదయం తెల్లవారక ముందే బీఆర్ఎస్ నేతల ఇండ్ల ముందు పహారా మొదలు పెట్టారు. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్టు చేశారు. చివరికి గాయాలతో ఇంట్లో ఉన్న నాయకుల వద్ద పోలీసులను మోహరించడం విశేషం.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అరెస్ట్‌కు నిరసనగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసుల నిర్బంధకాండకు వ్యతిరేకంగా నినదించారు. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నాయకులు కర్రె సూర్యశేఖర్ పాల్గొన్నారు.

నగరంలో బంద్ సందర్భంగా మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. నగరంలోని తన ఇంటి నుంచి కమాన్, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ అండ్ బీ చౌరస్తా, కోర్టు చౌరస్తా మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాకా ర్యాలీగా వచ్చారు. అనంతరం అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేకు మద్దతు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోహన్‌సింగ్, మైకెల్, అక్బర్‌హుస్సేన్, రంగు శ్రీనివాస్, జయంత్ పాల్గొన్నారు.
పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. టవర్‌సర్కిల్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉదయం నుంచే వచ్చినవారిని వచ్చినట్లుగానే నిర్భందించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టవర్‌సర్కిల్‌లోని లేబర్ అడ్డాకు చేరుకోగా పోలీసులు ఒక్కసారిగా రావడంతో కార్మికులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయపడిపోయారు. అయితే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ట్ చేశారు. అలాగే మార్కెట్ వెంకటేశ్వర దేవాలయం వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు.

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను గంగాధర మండలంలోని బూరుగుపల్లిలో, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను బెజ్జంకి మండలం గుండారంలో గృహ నిర్బంధం చేశారు. ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును వారి సొంత గ్రామమైన మానకొండూర్లోనే గృహ నిర్బంధం చేశారు. మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతిని హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ చౌక్‌లో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రంలోని కమలాకర్ నివాసం వద్ద శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించాయి. ఎమ్మెల్యే ఇంటికి తరలివస్తున్న కార్యకర్తలను లోపలికి అనుమతించకుండా, గంగుల తన నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. గంగుల తన ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టగానే పోలీసులు వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి నగరంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. కాగా, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు, నాయకులు బైక్ ర్యాలీగా వచ్చి గంగులకు మద్దతుగా నిలిచారు. నల్ల జెండాలతో బీజేపీ గుండాయిజానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం మాజీ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, నందెల్లి మహిపాల్, వెంకట్, శ్రీనివాస్‌రెడ్డి, మంథని కిరణ్, అక్బర్‌హుస్సేన్, శ్రీనివాస్, ఇతర నాయకులను అరెస్ట్ట్ చేశారు.
కరీంనగర్ బంద్ విజయవంతం చేసిన ప్రజలు, రైతులు, కార్మికులు, వివిధ వ్యాపార, ట్రేడ్ అసోసియేషన్లు, వాణిజ్య సంస్థలకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. బంద్‌ను విఫలం చేస్తామని ప్రకటనలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈరోజు ఎక్కడా కనిపించలేదు. బంద్‌కు లభించిన ప్రజా మద్దతును చూసి కాంగ్రెస్, బీజేపీలు షాక్‌కు గురై మౌనం పాటించాయి.

బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని గ్రహించి బయటకు రాలేదు. ఒకవేళ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ గూండాలు కలిసి నగరంలో మరింత అశాంతి సృష్టించి శాంతిభద్రతల సమస్యను తీవ్రతరం చేస్తారనే విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఉదయం నాలుగు గంటల నుంచే బీఆర్ఎస్ శ్రేణులను ఎకడికకడ అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత మందిని అడ్డుకున్నా ప్రజలు మాత్రం బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
‘ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో అలజడి సృష్టిస్తున్నరు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. కానీ కరీంనగర్లో కొత్త సంస్కృతిని తీసుకువస్తున్నరు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయనీయం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగలేదు. దాడుల సంస్కృతి సరికాదు. బండి సంజయ్ నీవు తెలిసి చేయించావా…? తెలియక చేయించావా చెప్పాలి. తెలియక చేస్తే వెంటనే ఆ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. కేంద్ర మంత్రిగా చట్టాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సరికాదు. కార్యకర్తలు దాడులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలె గానీ, ప్రోత్సహించవద్దు. మాపై దాడి చేసిన వారెవరో అందరినీ గుర్తు పెట్టుకుంటాం.
ఈ రోజు నా నివాసాన్ని ముట్టడించిన వారిలో 10 శాతం మంది ఉండి ఉంటే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగేది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ నాయకులు ఇప్పటికే మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. ప్రస్తుతం తమ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్లపై దాడి జరిగినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. జిల్లాలో శాంతి భద్రతల వ్యవహారంలో పోలీసులు ఏక పక్షంగా ఉండడం సరికాదు. తాను ఏం తప్పు చేశానని గృహ నిర్బంధం చేశారో పోలీసులు చెప్పాలి. విధి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే అసాంఘిక శక్తులను నిర్బంధించాలి. ఇటీవల బంగారం దోపిడీ చేసిన దొంగలను అరెస్టు చేయాలి. ఆ విషయాన్ని వదిలిపెట్టి వేల మంది పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చిన్రు. మాపై దాడులు జరగడాన్ని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు మాట్లాడడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. భౌతిక దాడులు జరగవద్దని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే బంద్‌కు పిలుపునిస్తే, సక్సెస్ కావద్దని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యాపారుల ఇంటికి వెళ్లి దుకాణాలు తెరవాలని కోరడం శోచనీయం. ఎవరేం చేసినా ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.’