కమలాపూర్ రూరల్, అక్టోబర్ 19 : ‘ఈటల రాజేందర్‌ను నమ్మి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను చేస్తే, సీఎం కేసీఆర్ మంత్రిని చేసిండు. కానీ ఈటల ఏం చేసిండు. అందరినీ వంచించి అక్రమంగా సంపాదించిన ఆస్తులను రక్షించుకునేందుకు బీజేపీలో చేరిండని.. ఆయన్ను ఎందుకు నమ్మాలని’ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మధ్యలోనే రాజీనామా చేసి రాజ్యాంగాన్ని దిక్కరించిండని మండిపడ్డారు. రాజీనామా ఎందుకు చేసిండో ముందుగా ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 1.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, రానున్న కొన్ని రోజుల్లో మరో 80వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నదని చెప్పారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇన్నేండ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా..? యువతను మోసం చేసింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో ఉన్న కొలువులు ఊడగొడుతున్నది. రాష్ట్ర సర్కారు సంక్షేమానికి కృషిచేస్తుంటే.. బీజేపీ మాత్రం సామాన్యులపై భారం మోపుతున్నది. వచ్చే ఎన్నికలో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలి. నామరూపాల్లేకుండా బొందపెట్టాలి’ అని దుయ్యబట్టారు. తాను ఉద్యమంలో పనిచేశానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చానని, ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి చేవ చేస్తానని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని, రూ.100కోట్ల ప్రత్యేక నిధులతో గ్రామాల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలనూ.. ప్రగతిని విస్మరించిండు..
‘నియోజకవర్గంలోని పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఈటల పట్టించుకోలే. ప్రగతిని పట్టించుకోలే. ఆయన కోసం ఆయనే పనిచేసిండు. తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ప్రజలనూ .. ప్రగతిని విస్మరించిండు. తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తే ఈటల మాత్రం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేకపోయిండని’ దుయ్యబట్టారు. ఇక ఇయనకు తోడు బండి సంజయ్. ఎంపీగా గెలిచి ఒరగబెట్టిందేమీ లేదని, రెండున్నర ఏండ్లలో ఏం చేసిండో గమనించాలని, బీజేపోళ్లను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ మండల ఇన్చార్జి పేరియాల రవీందర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దళిత ద్రోహి బీజేపీకి బుద్ధి చెప్పాలి
దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెస్తే బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పథకాన్ని నిలిపివేసింది. దళిత ద్రోహిగా మిగిలిపోయింది. ప్రజలు బాగు పడితే బీజేపీ నాయకులకు ఇష్టం ఉండది. అందుకోసమే దళితబంధు ఆపేందుకు కుట్రలు చేసిన్రు. మీ ఇండ్లల్లకు ఓట్ల కోసం వస్తే నిలదీసి, తరిమికొట్టాలి. పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలకు వచ్చే ఎన్నికలో గుణపాఠం చెప్పాలి. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గ ప్రజలకు ఈటల చేసిందేం లేదు. ఇప్పడేం చేస్తడు. ఆయనతో ఏం కాదు. నియోజవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే పేదింటి బిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇదే నా విజ్ఞప్తి.
ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్, ప్రతి ఎకరాకు సాగు నీరు, దేశంలోనే అత్యధిక ఆసరా పించన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. రాష్ట్రంలో టీఆర్ఎస్కు పోటీయే లేదు. వచ్చే ఎన్నికలో విపక్ష పార్టీలు అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖరారైంది.