హుజూరాబాద్, సెప్టెంబర్ 30: నియోజకవర్గంలోని యువతను ఈటల ఎదగనీయలేదని, రాజకీయంగా తనకు పోటీ లేకుండా పూర్తిగా అణగదొక్కాడని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. ఆయన దిమ్మతిరిగేలా ఉప ఎన్నికలో యువశక్తి చాటాలని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గురువారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె, తుమ్మనపల్లి గ్రామాల యువకులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు. పెద్దపాపయ్యపల్లె గొప్ప అదృష్టం చేసుకుందని, ఈ ఊరి అల్లుడు ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాడన్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో ఉండాలంటే నియోజకవర్గంలో మొదటి స్థాయిలో పెద్దపాపయ్యపల్లె గ్రామ ఓట్లు రావాలన్నారు. అత్యధిక మెజార్టీ సాధించిన మూడు గ్రామాలకు కేసీఆర్ వరాలు ఇస్తారని పేర్కొన్నారు. ఈటల నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దొంగల పార్టీకి కేరాఫ్‌గా ఉన్న బీజేపీలో చేరాడని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఈటల లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. రాజేందర్ దంపతులు కొత్త నాటకం ఆడబోతున్నారని, వారి కన్నీళ్లకు కరిగిపోవద్దని సూచించారు. ఈటల డబ్బు అహంకారంతో గెల్లు శ్రీనివాస్‌ను చిన్న చూపు చూస్తున్నాడని, ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, నాయకులు ఇరుమల్ల సురేందర్‌రెడ్డి, రాము, పోరెడ్డి దయాకర్‌రెడ్డి, వైద్యుల ముకుందరెడ్డి ఉన్నారు.
బీజేపీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లే..
ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే మురుగు కాలువలో వేసుకున్నట్లే. రాజేందర్ గెలిస్తే చేసేదేం లేదు. ఏడేళ్లు మంత్రిగా పని చేసిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే. బీజేపోళ్లు చెప్పే మాయమాటలకు మోసపోవద్దు. పెద్దపాపయ్యపల్లెను ఈటల పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరుగలేదు. ఇప్పుడు గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు యువత నడుం బిగించాలి.
గెల్లు శ్రీనును గెలిపించుకుంటం
ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్కు ఓటు వేయాలని వేడుకుంటం. ఈటల యువకులను ఎప్పుడూ పట్టించుకోలే. ఎన్నికల కోసమే యువతను దగ్గరికి తీసుకుంటండు.
రేయింబవళ్లు ప్రచారం చేస్తాం
టీఆర్ఎస్కు ఓటు వేయాలని రేయింబవళ్లు ప్రచారం చేస్తాం. యువకుల తడాఖా ఏందో ఉప ఎన్నికలో బీజేపీకి రుచి చూపెడుతాం. యువకులందరూ ఒకతాటిపై ఉండి టీఆర్ఎస్ను గెలిపించాలి.