కార్పొరేషన్, సెప్టెంబర్ 30: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఉద్యోగులు, సిబ్బంది పనితీరును గాడిలో పెట్టే దిశగా నూతన కమిషనర్ యాదగిరిరావు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా కార్యాలయంలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా కసరత్తు చేపట్టారు. ఇకపై విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానం ఉన్నా ఇన్నాళ్లు ఏ ఉద్యోగి, సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి కొనసాగుతున్నది. కొందరు ఉద్యోగులు, సిబ్బంది సాయంత్రం వచ్చి పోతామన్నట్లుగా వ్యవహరిస్తున్నానే విమర్శలున్నాయి. కొందరు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకే పని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కమిషనర్ నూతన సర్క్యులర్ జారీ చేశారు. ఇక నుంచి రెగ్యులర్, అవుట్ సోర్స్, కాంట్రాక్టు సిబ్బంది ఉదయం 10.30 గంటల వరకు బయోమెట్రిక్‌లో పంచ్ చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. అలాగే అవుట్ డోర్ సిబ్బంది కూడా సాయంత్రం 3 గంటల నుంచి కార్యాలయంలో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి
ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో సిబ్బంది ఉండాలని చర్యలు చేపట్టారు. ఉదయం 10.30 గంటలకు సిబ్బంది కార్యాలయానికి రావడంతో పాటు ప్రతినెలా వారికి అందించే జీతాలను కూడా హాజరు పట్టికను అనుసరించి చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకు హాజరు లేకపోతే వారి జీతాల్లోనూ కోతలు పెట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పలువురు ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం భోజనం పేరుతో గంటల తరబడి విధుల్లో లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కమిషనర్ దృష్టి పెట్టారు. మధ్యాహ్నం భోజనం పేరుతో ఇంటికి వెళ్తున్న సిబ్బంది సాయంత్రం 4గంటలైతే గాని కార్యాలయంలో కనిపించరు. ఇకపై అధికార స్థాయి ఉద్యోగులు మినహా మిగతా వారంతా లంచ్ బాక్స్‌లు తీసుకొని రావాలని సూచించారు.
అవుట్ డోర్ ఉద్యోగులు కూడా..
కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందితో పాటు అవుట్ డోర్ విధులు నిర్వహించే ఉద్యోగులూ ప్రతిరోజూ సాయంత్రం 3నుంచి కార్యాలయంలో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఇకపై ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో ఉండి సేవలందించేలా కమిషనర్ చర్యలు చేపట్టారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, నీటి నిర్వహణ తదితర అన్ని విభాగాల సిబ్బందికి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కార్యాలయంలో ఏ మేరకు మార్పులు వస్తాయో వేచి చూడాలి.