కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో హుజూరాబాద్ ఉపఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ నిబంధనలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రచార పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలని, ఎన్నికల ఖర్చు వివరాలను ప్రతిరోజూ ఎన్నికల పరిశీలకుడికి అందించాలన్నారు. ఎన్నికల ఖర్చులపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీవీటీ బృందాల నిఘా ఉంటుందన్నారు. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని, పత్రికలు, సోషల్ మీడియా, వెబ్ సైట్లో ప్రకటించాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఉపసంచాలకులు, ఆడిట్ శాఖ రాములు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, మహ్మద్ అకిల్ ఫిరోజ్, నాంపెల్లి శ్రీనివాస్, చీటి రాజేందర్రావు, చంద్రశేఖర్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగనున్నందున ఓట్ల లెకింపు ప్రక్రియను నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీసీపీ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరచడంతో పాటు నవంబర్ 2న ఓట్ల లెకింపు నిర్వహించేందుకు కళాశాలలోని ఆడిటోరియం హాల్, ఇండోర్ స్టేడియం, గ్రంథాలయ భవనం, తరగతి గదులను పరిశీలించారు. ఆయన వెంట కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏసీపీ తుల శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు, ల్యాండ్ సర్వే అశోక్, తహసీల్దార్ సుధాకర్, కలెక్టరేట్ ఏవో లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 30: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో (ఆర్డీవో కార్యాలయం) నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గురువారం సాయంత్రం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. హుజూరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. నియోజకవర్గంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ను వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి ఒకరూ మాస్ ధరించాలని, శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరుచుకోవాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జువేరియా, తహసీల్దార్ రాంరెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.
ఎన్నికల ఖర్చులను విధిగా సమర్పించాలి. పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వద్దు. చెకులు, డీడీలు, ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయాలి. పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంకులో జీరో అకౌంట్ ఉండాలి. ఖాతాల నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలి. ఎన్నికల ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారంలోగా స్టార్ క్యాంపెయిన్‌కు వచ్చే వారి వివరాలను ముందుగానే అందించాలి.
స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభల్లో వెయ్యి మంది మించద్దు. ఇండోర్ సమావేశాలకు 200 మంది, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలి. రోడ్డు షోలు, బైక్, కార్లు, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు. అభ్యర్థి, అతడి రాజకీయ పార్టీ 20 వాహనాలకంటే ఎక్కువ వినియోగించరాదు. ఎన్నికలకు 72 గంటల్లోగా ప్రచారాన్ని ముగించాలి.