“స్వరాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు సహకరిస్తున్నం. ఓసీల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినం. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నం. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నం. మీరు ధర్మం, న్యాయం వైపు నడవాలి” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం జమ్మికుంటలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి హాజరయ్యారు.
జమ్మికుంట, సెప్టెంబర్ 30 : ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆర్యవైశ్యులను స్వరాష్ట్రంలో వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. “ఇగ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి, అభివృద్ధిని పట్టించుకోని ఈటల ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నడు. పార్టీలోఆయనకు జరిగిన న్యాయం మరెవరికీ జరుగలేదు. 2004ల కేసీఆర్ టికెట్టిచిండు. అప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. ఆకాశమంత ఎదిగేందుకు ఈటలకు చేయూతనిచ్చిండు. తన కుడి భుజం అన్నడు. తమ్ముడని ఆప్యాయతతో పిలుచుకున్నడు. అయినా పార్టీని వీడిండు. ఉప ఎన్నిక రావడానికి కారణమైండు. బీజేపీలో చేరిండు. ఓటమి అంచున నిలిచిండు. రాజకీయంలో అక్షరాలు నేర్పించి, గొప్ప భవిష్యత్‌ను ఇచ్చిన కేసీఆర్‌కు ఘోరీ కడుతనని మాట్లాడుతున్నడు. దీన్ని సమాజం హర్షించడం లేదు. ఆయన మాటలు ప్రజలు గౌరవాన్ని దెబ్బతీస్తున్నయ్. కొన్నేండ్లు పదవిలో ఉండి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యని ఈటల మనకెందుకు..? ఒకే ఒక్క అవకాశం గెల్లు సీనుకివ్వండి. అభివృద్ధిని పరుగుల పెట్టిస్తం. మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తం.’అని స్పష్టం చేశారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి పట్టంగట్టాలని కోరారు. ఆర్యవైశ్యుల దీవెనలకు తమలో బాధ్యతను పెంచాయన్నారు. ప్రతి మండలంలోనూ ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్స్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికే జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో ఒక్కో ఎకరం, రూ.కోటి నిధులు అందించిన విషయాలను గుర్తు చేశారు. ఆర్యవైశ్యులను మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఈటలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక పార్టీ బీజేపీ అని, పెరిగిన ధరలను వివరించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ సర్కారు కట్టించబోయే డబుల్ బెడ్రూం ఇండ్లలో పేదలకు ప్రత్యేక కోటా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని, మీకు సేవచేసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పేదింటి బిడ్డ, ఉద్యమ నాయకుడు గెల్లు సీనని, ఆయన పేరులోనే గెలుపు ఉందన్నారు. టీఆర్ఎస్కే మద్దతు పలుకాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్, కౌన్సిలర్లు లావణ్య, రాజు, మాధవి, జమ్మికుంట రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు జీ రాజమౌళి, నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్యులు, మిల్లర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.
మీ తమ్ముడిలా ఉంటా..
ఆర్యవైశ్యులకు తమ్ముడిలా ఉంటా. మీ బాధలు పంచుకుంటా. కుటుంబ సభ్యుడిలా మెలుగుతా. సమస్యలు తెలుసుకుంటా. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమస్యలు పరిష్కరిస్తా. ఆరుసార్లు టీఆర్ఎస్కే ఓటేశారు. గెలిపించారు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మీ కష్టసుఖాల్లో తోడుంటా. రెండేండ్లు నిర్విరామంగా శ్రమించి మీ ఆదరాభిమానాలు చూరగొంట.
గెలిచేది సామాన్య వ్యక్తులే
పాత కమలాపూర్ నియోజకవర్గం నుంచి నేటి హుజూరాబాద్ నియోజకవర్గం వరకు ఇక్కడ గెలిచేది సామాన్య వ్యక్తులే.. హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. 1985లో అప్పుడు చికెన్ సెంటర్ నడుపుకునే సాధారణ వ్యక్తి ముద్దసాని దామోదర్‌రెడ్డి గెలిచిండు. ఇప్పుడు సాధారణ వ్యక్తి, ఉద్యమ నాయకుడు అయిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలవడం ఖాయం. సీఎం కేసీఆర్ తీసుకు వస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధే టీఆర్ఎస్కు రక్ష. సబ్బండ వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంట నిలిచి గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదిస్తారు.
నీ దుకాణం బంద్ చేసుకో
ఈటల రాజేందర్.. నువ్ అనేక పదవులు అనుభవించినవ్. మా పక్క ఊరు నాగారం నుంచి దేవునికి పూజలు చేసి ఎన్నికలకు వెళ్లినవ్. నీ వెంట ఉండి మేం పని చేసినం. గెలిపించుకున్నం. ప్రజలకు అండగా ఉండే కేసీఆర్ సార్ అనేక పథకాలు తెస్తే దళితుల భూములను కొని పార్టీ నుంచి బయటకు వచ్చినవ్. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీలో చేరినవ్. మండలం కావాలని ఎన్నిసార్లు అడిగినా మమ్ములను పట్టించుకోకుండా ఇల్లందకుంట మండలాన్ని తెచ్చినవ్. మా గ్రామానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినవ్. గతంల మంత్రిగా పనిచేసిన దామోదర్‌రెడ్డి మాకు అన్ని రకాల అభివృద్ధి చేసి రోడ్లు వేసిండు. నీ సొంత లాభం కోసం హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికలను తీసుకొచ్చినవ్. బొచ్చెడు కోడిగుడ్ల పైసలున్నయ్ అని.. గొడుగులు, మద్యాన్ని పంచింది నువ్వు కాదా?, నీ అవినీతిని అందరూ చూస్తున్నరు. అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంట ఉండి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటం.
వచ్చినవ్, పోయినవ్.. మాకేం చేసినవ్
అయ్యా.. ఈటల రాజేందర్ సార్. మా ఊరికి వచ్చినవ్, పోయినవ్. మమ్ములను పట్టించుకున్నవా?. మండలం చేయమని అడిగితే పోలీసులతో కొట్టించినవ్. పదవులు అనుభవించి మా గురించి ఒక్కరోజైనా ఆలోచించినవా?. నీ అభివృద్ధినే చూసుకున్నవ్. మమ్మల్ని పట్టించుకోలే. కేసీఆర్ సార్ మా కోసం ఎన్నో పథకాలను తెచ్చి అమలు చేస్తే దళితుల భూములను గుంజుకొని రాజీనామా చేసినవ్, నీకు మా ఊరికి వచ్చే అర్హత లేదు. నిన్ను మా ఊరు నుంచే రాజకీయ సమాధి చేస్తం.
సొంత ఎజెండా కోసమే రాజీనామా
సొంత ఎజెండా కోసమే ఈటల రాజీనామా చేసిండు. సానుభూతి కోసం ఆత్మగౌరవం అంటూ ప్రజల మీద రుద్దుతుండు. ఎన్నికల కోసమే ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తున్నదంటూ ఈటల పదేపదే మాట్లాడుతున్నడు. ఇది శుద్ధ అబద్దం. ఆయన చేయలేని పనులను ప్రభుత్వం చేస్తుందని గుర్తు పెట్టుకో. రోడ్డు వేయలేదు కనుకనే రోడ్డు వేస్తున్నరు. మురుగు కాలువలు, ఇతర పనులు చేయలేదు కనుకనే మంత్రులు వచ్చి పని చేస్తున్నరు. ఏ ఒక్క కుల సంఘం అడిగినా గుంట స్థలం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇస్తుంటే ఆయనకు కళ్లు మండుతున్నయ్. ఇప్పుడు ఇచ్చే జాగలు అప్పుడు ఇక్కడ లేవా. ఈటలకు ఇవ్వాలనే ఆలోచన రాలేదు కనుకనే ఇవ్వలేదు. ఆయన గెలుపు జరగని పని. ఛాలెంజ్ చేస్తున్నా. ఎమ్మెల్యేగా గెలువడు. డిపాజిట్ కోసం ఆయన కొట్లాడేది.
-సంగెం ఐలయ్య (హుజూరాబాద్)
మేమందరం కారుకు ఓటేస్తం..
తెలంగాణ ప్రభుత్వం అచ్చినకాడి నుంచి దళితుల కోసం మంచిచేస్తున్నది. మొదట్ల కొంతమందికి భూములు ఇచ్చింది. యువకులు వ్యాపారాలు చేసుకొనేందుకు రుణాలు మంజూరు చేసింది. ఇప్పుడు దేశంల ఎక్కడాలేనివిధంగా దళితబంధును అమలు చేస్తున్నది. మా కాళ్ల మీద మేం నిలబడేందుకు రూ. 10లక్షలు ఇచ్చింది. మమ్మల్ని ఆదుకున్న సర్కారుకు రుణపడి ఉంటం. ఎవ్వలు ఏమన్నా మేమందరం కారుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించుకుంటం.
స్వరాష్ట్రంలో సముచిత స్థానం..
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటుతున్నా ఆర్యవైశ్యులను పాలకులు పట్టించు కోలేదు. ఇందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తున్నరు.. రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు తోడ్పాటు నందిస్తున్నరు. ఆర్థికంగా చేయూతనందిస్తున్నరు. ఈ సర్కారు ఎన్నడూ లేనివిధంగా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో కమ్యూనిటీ భవనాల ఏర్పాటుకు నిధులిచ్చింది. గెల్లును గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యం.
వ్యాపారులను కాపాడుతున్నరు.
2004 నుంచి టీఆర్ఎస్లనే పనిచేత్తున్న. ఈ సర్కారు హయాంలోనే వ్యాపారులు ఓ తీరుగ బతుకుతున్నరు. సీఎం కేసీఆర్ మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నరు. అడగకముందే అన్ని ఇస్తున్నరు. ఆర్యవైశ్యల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నరు. ఎప్పుడైనా మా వైశ్యులంతా టీఆర్ఎస్ దిక్కే ఉంటున్నరు. అంతా ఒక్కతాటి మీదకు వచ్చినం. సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపరుచుతం. గెల్లు సీనును గెలిపించుకుంటం.
హేళన చేసిన ఈటలను ఓడిస్తం..
మా సంఘానికి కమ్యూనిటీ స్థలం కావాలని అప్పటి మంత్రి ఈటలను కోరినం. చెప్పులరిగేలా తిరిగినం. మమ్మల్ని పట్టించుకోలే. అంతేకాకుండా హేళన చేసిండు. మీరంతా ఎంతమంది ఉన్నరు.. గుప్పెడంత మంది లేరనెటోడు. ఇప్పుడు జెప్తున్నం. ఈ గుప్పెడే.. గెల్లు సీనును గెలిపిస్తయ్. అట్లాంటి, ఇట్లాంటి మెజార్టీతో కాదు.. భారీ మెజార్టీనిత్తం. మమ్మల్ని హేళన చేసినోళ్ల భరతం పడతం. – లెంకలపెల్లి శరత్‌కుమార్,
ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు
అడగకముందే అన్ని ఇయ్యవట్టే
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అట్లాంటిది.. టీఆర్ఎస్ పార్టీ ఆర్యవైశ్యులకు అన్నీ ఇస్తోంది. కమ్యూనిటీ హాల్ కోసం ఎకరం స్థలం ఇచ్చింది. కట్టుకోవడానికి రూ.50లక్షల నిధులిచ్చింది. అసలు వైశ్యులు ఎవ్వరి వద్ద ఏం తీసుకోరు. ఇచ్చేవాళ్లే. అలాంటిది మాకు సహాయం చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటం. రుణం తీర్చుకుంటం. ఆర్యవైశ్యులంటేనే త్యాగానికి ప్రతీకలు. తప్పకుంటా పనిచేసే ప్రభుత్వానికి అండగుంటం.
స్వరాష్ట్రంలో సమన్యాయం ..
స్వరాష్ట్రంలో సమన్యాయం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేదు ఇట్లా. గొప్ప నాయకుడు కేసీఆర్. సీఎంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నాడు. బీజేపీ కుసంస్కారమైన పార్టీ. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైన ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా..? చెప్పాలే. విమర్శలు అవసరం లేదు. పట్టణంలో ఆరు వార్డుల్లో ఆర్యవైశ్యులున్నరు. సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉంటది. వందశాతం ఓట్లేస్తం. గెల్లు సీనుకు భారీ మెజార్టీని అందిస్తం. – చందా రాజు, మాజీ కౌన్సిలర్
టీఆర్ఎస్కే జై
పార్టీకి పెరుగుతున్న మద్దతు
అండగా నిలుస్తున్న కుల సంఘాలు
ఏకగ్రీవ తీర్మానం చేసిన బైల్ కమ్మరి సంఘం
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 30: టీఆర్ఎస్ బలం.. బలగం పెరుగుతున్నది. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో ఏడున్నరేండ్లు సాగిన పాలనకు ప్రజానీకం ఫిదా అవుతున్నది. ‘మీ వెంటే మేము ఉంటాం’ ‘మళ్లీ మీరే రావాలి’ అంటూ కోరుకుంటూ, ఇంటిపార్టీకే జైకొడుతున్నది. గురువారం హుజూరాబాద్ డివిజన్లోని 60 బైల్ కమ్మరి కుటుంబాలు పార్టీకి మద్దతు పలికాయి. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి, ప్రతిని టీఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్‌కు అందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓటేస్తామని ప్రతినబూనారు. గెల్లును గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ బైల్ కమ్మరి సంఘం నాయకులు రాజు, బాలకృష్ణ, శ్రీను, మధు, చవన్, రమేశ్, తదితరులున్నారు.
జైకొట్టిన మాల సంక్షేమ సంఘం
కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల చెందిన మాల సంక్షేమ సంఘం కులస్తులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గురువారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో కుల సంఘ నాయకులు పార్టీలోచేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ సర్పంచులు గిరవేన రమారాజయ్య, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు కడవెరుగు మమత, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, ఉప సర్పంచ్ ఓదెలు, నాయకులు మనోహర్‌రావు, మోహన్, కుల సంఘా నాయకులు కొత్తపల్లి సాయిలు, మాణిక్యం, భిక్షపతి, సతీశ్, ప్రవీణ్, ప్రశాంత్ ఉన్నారు.
దళితబంధు మాకు వరం
సీఎం కేసీఆర్ తీసుకచ్చిన దళితబంధు పథకం మాకు వరంలాంటిది. ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని వమ్ము చేయకుండా దళితబంధుతో అభివృద్ధి చెందుతం. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదు. వచ్చే ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను అధిక మెజార్టీతో గెలిపిస్తం.
కేసీఆర్‌తోనే పేదలకు మేలు..
సీఎం కేసీఆర్ సారు పాలనలోనే నిరుపేద కుటుంబాలకు మేలు జరిగింది. అన్ని కులాల వాళ్లు ఎదుగడానికి పథకాలు తీసుకొచ్చిండు. రైతులకు బీమా, రైతుబంధు ఇచ్చిండు. గోల్లోళ్లకు గొర్లు, ముదిరాజ్‌లకు చేపలు పంపిణీ చేసిండు. మంగళి కులస్తులకు ఉచిత కరెంట్ ఇస్తున్నడు. రోడ్లను బాగు చేసిండు.
దళితబంధువు మా బతుకుదెరువు
దళితబంధువు పథకంతో పది లక్షలు ఇస్తున్నారు. వాటితో వ్యాపారం చేసుకుంటం. కేసీఆర్ పెట్టిన దళితబంధు పథకమే మా బతుకుదెరువు. ఎండ్ల నుంచి చూస్తున్న మాకు ఎవ్వలు మంచి జేయలేదు. ఓట్ల ముందట ఒకటి చెప్పి అయిపొంగనే మరిచిపోయేది. కానీ సీఎం సారు మాకు మస్తు చేస్తున్నడు. .
-దాసారపు పోచయ్య-నర్సంపూర్ (వీణవంక రూరల్)
కోటా ఇచ్చిన కేసీఆర్ వెంటే నడుస్తం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గౌడ్ కులస్తులకు ఆదుకుంటున్నడు.. ఈత, తాటి చెట్ల పన్నులు మాఫీ చేసిండు. 50 ఏండ్లకే పింఛన్ ఇస్తున్నడు. ఎవరైన్నా చెట్టు మీది నుంచి పడి చనిపోతే రూ. 5లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నడు. ఇప్పుడైతే మద్యం దుకాణాల్లో 15 శాతం కోటా ఇస్తున్నడు. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్న కేసీఆర్ వెంటే నడుస్తం.