Boyanapalli Vinodkumar | కార్పొరేషన్, జులై 18 : రైతుల నార్లు ముదిరి నష్టపోక ముందే కన్నేపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి మధ్య మానేరు ఎల్ఎండీకి నీరు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన వానలు రాకపోవడంతో ఏ ప్రాజెక్టులోను నీరు లేదని పేర్కొన్నారు.
మధ్య మానేరు ఎల్ఎండీలో నీటిమట్టం లేక రానున్న కాలంలో మంచినీటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మేడిగడ్డ వద్ద నేడు 82230 క్యూసెక్కుల వరద నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ కుంగి పోయిందని ఎత్తిపోతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే అవకాశమే లేదని పేర్కొన్నారు. కన్నెపల్లి వద్ద 94 మీటర్ల లోనే వరద ప్రవాహం ఉంటే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందన్నారు.
ఇప్పుడు 96 మీటర్ల మేరకు వరద ప్రవాహం ఉందని గుర్తు చేశారు. ప్రతీరోజు 20వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసిన పది రోజుల్లోగా మద్యం మానేరును పూర్తిస్థాయిలో నింపవచ్చని పేర్కొన్నారు. అక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు రైతులు నాట్లు వేసేందుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కాలేజీ ప్రాజెక్టు నిర్మించారన్న ఒక్క కారణంతోనే వారిని బదనాం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేయకుండా కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఎండీఎస్ఏ కూడా ప్రభుత్వం మరమ్మతులు చేయించవచ్చని పేర్కొందని, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ ఎందుకు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
నాట్లు వేసుకునేందుకు సాగునీరు అందించాలని, అనేక ప్రాంతాల నుండి రైతులు అడుగుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా మల్లన్న సాగర్ నుంచి మాత్రం గండిపేటకు మూసి ప్రక్షాళనకు నీళ్లు మళ్లిస్తామని చెబుతూనే ఉందని పేర్కొన్నారు. కేవలం కేసీఆర్ భజనం చేసే కుట్ర నడుస్తుందని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలోని రైతులు నాట్లకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాట్లు వేసే సమయం అయిపోతే నార్లు పూర్తిగా ముదిరిపోయిన ఈసారి పంట ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కష్టాన్ని గుర్తుపెట్టుకుని సాగునూరు అందించేందుకు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని, రాజకీయాల కతీతంగా తాము చేతులెత్తి అడుగుతున్నామని పేర్కొన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు మానుకొని పంట వేసుకునేందుకు అవసరమైన సాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్, జక్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.