Kamanpur | కమాన్ పూర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ద్విచక్ర (బైక్) వాహనాలతో ర్యాలీని ప్రారంభించారు.
పురవీధుల గుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారి పై కమాన్ పూర్ క్రాస్ రోడ్డు వరకు చేరుకుని అక్కడి నుండి తిరిగి పోలీసు స్టేషన్ దారి గుండా కమాన్ పూర్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా ఎస్ఐ కొట్టె ప్రసాద్ తో పాటు పోలీసులు హుటాహుటిన బీఆర్ఎస్ శ్రేణుల వద్దకు చేరుకుని అడ్డుకుని దిష్టి బొమ్మను పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని మండిపడ్డారు. ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలతో ప్రజలను దగా చేస్తున్న మోసకారి కాంగ్రెస్ సర్కార్ కు రానున్న కాలంలో తగిన బుద్ది చెబుతామంటూ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్, యూత్ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మేకల సంపత్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మి మల్లు, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ సర్పంచ్ కొండ వెంకటేష్, నాయకులు పల్లె నారాయణ, వరాల ఎల్లయ్య, పులిపాక రాయలింగు, మేకల ఎల్లయ్య, చొప్పరి తిరుపతి, కోయడ కుమార్ యాదవ్, జాబ్ శ్రీనివాస్, భూపెల్లి మల్లేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.