ధర్మపురి, నవంబర్ 20: ‘మేం చేయ్యి గురోళ్ల లెక్క ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం. నిజాయితీగా ఉంటం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతం. ఈ పదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నయి. ఒకప్పుడు ధర్మపురి నియోజకవర్గం ఎట్లుండె.. ఇప్పుడెట్ల మారిందో.. చూడండి. ఆలోచించండి. మీ వె న్నంటి ఉండే నన్ను ఆశీర్వదించి, అసెంబ్లీకి పం పించండి’ అని ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్మపురి మం డలం కమలాపూర్, నాగారం గ్రామాల్లో సోమవారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు.
అంతకు ముందు గోవిందుపల్లిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చేరుకున్న మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికి తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ఆయాచోట్ల వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. ‘నేను చేసిన పనులను ప్రచారంలో చెప్పే టైంలో ఒకటి రెండు మరిచిపోయినా ప్రజలే గుర్తుచేస్తున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు అసత్యప్రచారాలు చేస్తున్నరు.
అబద్ధాలు చెబుతున్నరు. నమ్మితే గోసపడుతరు. వాళ్లను నమ్మదు. పని చేసే ప్రభుత్వానికే పట్టం గట్టాలె’ అని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాకముందు ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలిచావులు, వెయ్యి ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు పడక గొడగొడ ఏడ్చిననాడు మీ కన్నీ ళ్లు తుడిచేందుకు ఎవరైనా వచ్చారా..? ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు పడ్డామో..? గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పడ్డ కరెంట్ బాధలు ఎలా ఉండెనో ఒకసారి అవగతం చేసుకోవాలని, మళ్లీ ఆ నరకం మనకు అవసరమా..? అని ప్రశ్నించారు. ముక్కిపోయిన మూడు గంటల కరెంట్ కా వాలా.. 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. ఆలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కర్ణాటక మోడల్ నమ్ముకుంటే కటిక చీకట్లోకి వెళతామన్నారు. నాటి పాలనలో రూ.200 మాత్రమే ఇచ్చేవారని, అది ఏ మూల కూ సరిపోయేదికాదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి రాగానే పింఛన్‌ను మొదట రూ.వెయ్యి ఇచ్చి కొద్ది రోజులకే రూ.2వేలకు పెంచుకున్నామన్నారు.
ఇప్పుడు రూ.3వేలు, రూ.4వేల వరకు ఇచ్చుకుంటున్నామన్నారు. కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా.. వెయ్యి రూపాయలు దాటి ఇస్తున్నారా..? చెప్పాలని ప్రశ్నించారు. అక్కడ రూ.1000కి మించి ఇవ్వనోళ్లు.. ఇక్కడ రూ.4వేలు ఇస్తామంటే ఎలా నమ్మాలి..? అని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం ఆలోచించి అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టో పార్టీ విజయానికి నాంది అవుతుందన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి పని చేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని, బీఆర్ఎస్ కారుగుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, కమలాపూర్, నాగారం సర్పంచులు కొండపెల్లి లక్ష్మి, రూపు సత్తెమ్మ, నాయకులు కొండపెల్లి సుధాకర్‌రావ్, కుమ్మరి లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్, సట్టంశెట్టి అనీల్, సాయిని వినయ్, నరేశ్, లక్ష్మణ్, రాజుగౌడ్ ఉన్నారు.