Boinapally | బోయినపల్లి రూరల్, ఆగస్టు 3 : తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు విషం చిమ్ముతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బద్నాం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల, మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేరు వంటి అనేక నిర్మాణాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తు చేశారు. నీటిని విడుదల చేస్తే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని సక్రమంగా విడుదల చేసి మిడ్ మానేరు నిండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మర్లపేట గ్రామంలోని వరద కాలువ వెంట ఉన్న విలాసాగర్ చెరువును గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ రూ.2 కోట్ల వ్యయంతో పైప్లైన్ ద్వారా నింపించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారని తెలిపారు. ఆ సందర్భంగా స్థానిక రైతులు కేటీఆర్ కి అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేసీఆర్ బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ నాయకులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల తాజా మాజీ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకెల సత్యనారాయణ రెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, అక్కనపల్లి కరుణాకర్, మల్లారెడ్డి, స్వామి, బత్తిని కమల్ గౌడ్, బోయినీ రాజు, కన్నం సాగర్, తొంటి మధు, బూర్గుల నందయ్య, లింగయ్య, రషీద్, చందు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.