పెద్దపల్లి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన శుక్రవారం విజయవంతంగా సాగింది. గురువారం సాయంత్రం లోయర్‌మానేరు డ్యాంను పరిశీలించిన బృందం, అదే రోజు రాత్రి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నది.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకుల బృందానికి బసంత్‌నగర్, గోదావరిఖనిలో స్థానిక నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. రాత్రి 11 గంటలకు ఎన్టీపీసీలోని జ్యోతిక గెస్ట్ హౌస్‌కు చేరుకొని రాత్రి అక్కడ బస చేయగా.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పర్యటన ప్రారంభమైంది. గోదావరిఖని మీదుగా బ్రిడ్జి దాటుతుండగా.. ఎప్పుడూ నిండుకుండలా ఉండే గోదావరి బోసిపోయి కనిపించడంతో కేటీఆర్ తన వాహన శ్రేణిని నిలిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
తమ బృందంతో చర్చిస్తూ తిరిగి పర్యటనను ప్రారంభించారు. అనంతరం మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించగా శ్రీరాంపూర్ క్రాసింగ్ నుంచి దారిపొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడు, ప్రతినిధులను ఘనంగా స్వాగతించారు. చెన్నూర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామం సిరొంచ మీదుగా జయశంకర్భూపాలపల్లి జిల్లా మెట్పల్లి మీదుగా కాళేశ్వరం చేరుకున్నారు.
బృందం సభ్యులు నేరుగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేశారు. తర్వాత త్రివేణి సంఘమమైన గోదావరి తీరానికి చేరుకొని చీర సారె సమర్పించి, వాయినం ఇచ్చారు. అనంతరం నేరుగా కన్నెపల్లి పంపుహౌస్, ఫోర్బేను పరిశీలించి, అధికారులతో చర్చించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి, దిగువకు ప్రవహిస్తున్న ప్రాణహిత జలాలను పరిశీలించారు.

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర కరువును తరిమికొడితే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూపి ప్రాజెక్టు మొత్తాన్నే అబాసుపాలు చేసే కుట్రలకు దిగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. సమద్ర మట్టానికి 80 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 650 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించాలంటే ఎత్తిపోతలే సరైన మార్గమని స్పష్టం చేశారు.
కానీ, కాంగ్రెస్ సర్కారు రైతులను ఆగం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులను ఆగస్టు 2 లోగా ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే ఆన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల బృందంతో కలిసి శుక్రవారం పర్యటించిన ఆయన, మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి వద్ద మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడంలో సర్కారు చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. 90 టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉన్నప్పటికీ 25 టీఎంసీల కంటే తక్కువగా నీళ్లు ఉన్నాయన్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, 24 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్ఎండీలో 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, 26 టీఎంసీల కెపాసిటీ ఉన్న మిడ్ మానేరులో సైతం 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు.
కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట, సిరిసిల్ల, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు, భువనగిరి వరకు సాగునీళ్లు ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌కు సైతం మంచినీళ్లు అందించవచ్చని చెప్పారు. లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని, ప్రతీ రోజు 2 టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నదన్నారు. రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీటిని వృథాగా కిందికి వదిలి వేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ రిజర్వాయర్లు మాత్రం నీరు లేక ఎడారిలాగా కనపడుతున్నాయన్నారు. ఐదారేండ్లపాటు నిండుగా దర్శనమిస్తున్న మిడ్ మానేరు ఇప్పుడు ఎడారిగా కనిపిస్తున్నదన్నారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీళ్లు చేరుకుంటాయని, కొండ పోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తే దానిని వాడుకునే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తామన్నారు.
అనంతరం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తమ ప్రాంతాలైన నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయని, మానేరు డ్యాంకు పుష్కలంగా నీరంది గొప్పగా పంటలు పండాయని గుర్తు చేశారు. ఇప్పుడు సర్కారు రాజకీయ దురుద్దేశంతో మోటర్లను ఆన్ చేయడం లేదని నిలదీశారు.
ఈ పర్యటనలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, విజయుడు, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వాణీదేవి, నవీన్‌కుమార్, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేశ్, జక్కు రాకేశ్, కౌశిక్‌హరి, దాసరి ఉష పలువురు ఉన్నారు.