Kaleshwaram Project | ధర్మారం,ఆగస్టు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీ పంపు హౌస్ లో ఒక మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. వరద కాలువకు అనుబంధంగా ఉన్న ప్రాంతంలో వానకాలం సీజన్ లో వరి నాట్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జలాలను ఎత్తిపోసే ప్రక్రియను నిర్వహించినట్లు ఆ శాఖ డీ ఈ ఈ గునిగంటి నర్సింగరావు తెలిపారు.
నంది పంపు హౌస్ లో ఆదివారం ఉదయం 7:30 గంటలకు 5వ మోటార్ ను ఆన్ చేశారు. డెలివరీ సిస్టర్న్ ద్వారా ఎగిసిపడి వచ్చిన 3,150 క్యూసెక్కుల చొప్పున గోదావరి జలాలు 7వ ప్యాకేజీ లోని నంది రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు. అదే పరిమాణంలో ఈ రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా 8వ ప్యాకేజ్ లోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ కు తరలించారు. అక్కడ 6వ మోటార్ ను ఆన్ చేయడంతో జలాలు వరద కాలువలోకి సరఫరా చేశారు. కాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలనుసారం సాయంత్రం 5:55 నిమిషాల సమయంలో నంది పంప్ హౌస్ లోని మోటార్ ను నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. సుమారు 10:30 గంటల పాటు నీటి ఎత్తిపోతలు జరగగా 0.15 టీఎంసీ నీరు తరలినట్లు డి ఈ ఈ నర్సింగరావు వెల్లడించారు.