Karimnagar | తిమ్మాపూర్, డిసెంబర్26: లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో శివం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రణాళిక రూపొందించారు. ఈనెల 31న ఉదయం కెనాల్ విడుదల చేసి మూడు నెలలపాటు మార్చి 31 వరకు కొనసాగించడానికి అధికారులు సిద్ధం చేశారు.
వారబంధీ పద్ధతిన..
కాకతీయ కాలువ 146 కిలోమీటర్ అల్గునుర్ నుండి 340 కిలోమీటర్ సూర్యాపేట వరకు రెండు జోన్లుగా విభజించి వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ మూడు నెలలపాటు ప్రతినిత్యం నడుస్తూనే ఉండనుండగా.. కిలో మీటర్ 146 అల్గునుర్ నుండి 284 మహబూబాద్ వరకు జోన్1 మొదటి 7రోజులు, కెనాల్ 284కిలో మీటర్ నుండి చివరి ఆయకట్టు 340కిలో మీటర్ సూర్యాపేట వరకు జోన్2కు 8రోజులు నీటిని విడుదల చేయనున్నారు.
ప్రతీనిత్యం 5వేల క్యూసెక్కులు
మూడు నెలల పాటు కాకతీయ కాలువ ద్వారా ప్రతినిత్యం 5వేల క్యూసెక్కుల నీటిని దిగువ పంటలకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్ లో నీళ్లు నిండుకుండలా ఉన్నాయి. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండిలో 23.732 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉన్నాయి.
నీటిని కాపాడుకోవాలి : ఎస్ఈ రమేష్
యాసంగి పంటలకు నీటిని పొదుపుగా వాడుకోవాలని రిజర్వాయర్ ఎస్ఈ రమేష్ రైతులను కోరారు. నీటిని వృధా చేయొద్దని సూచించారు. పంటలు తాము సూచించిన సమయంలో పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మార్చి తర్వాత నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదని ముందస్తుగా తెలిపారు. నేటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.