KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 11: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వద్దనున్నపూలే విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బహుజనులకు చదువే అభివృద్ధి మార్గమని సూచించి ఆనాటి రోజుల్లో మహిళా చదువును ప్రోత్సహించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.
మహిళలను వంటింటికే పరిమితం చేసిన రోజుల్లో తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించడంతోపాటు మహిళా పాఠశాలలను స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. భర్త మరణించిన స్త్రీలకు ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారు చదువుకునేలా ప్రోత్సహించారని, ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించాలని తెలిపారు.
సమాజాభివృద్ధికి ఎంతో కష్టపడిన పూలే త్యాగాలు మరువలేనివని, ఆయన మార్గాన్ని ఆచరించాలని అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఆనాటి కాలంలో ప్రజలను చైతన్యం చేయడంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించడమే కాకుండా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన పూలే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపూలే రాసిన పుస్తకాన్ని, తెలుగు, ఇంగ్లీష్ అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మనకొండూర్, చొప్పదండి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనరాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, బీసీ సంఘాల నేతలు, అధికారులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.