Sunke Ravishankar | గంగాధర, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలోనే భారతీయ విద్యార్థులు చదువుకోడానికి సొంత డబ్బుతో పాఠశాలను ఏర్పాటు చేసి, పాఠ్య పుస్తకాలు అందజేశారని గుర్తు చేశారు.
సమాజంలోని అంటరానితనం, కులవివక్షను రూపుమాపడంతో పాటు మహిళా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు జ్యోతిబాపూలే అని కొనియాడారు. జ్యోతిబాపూలే ఆశయాలను ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల మధుసూదన్, శ్రీమల్ల మేఘరాజు, వడ్లూరి ఆదిమల్లు, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, గంగాధర ప్రవీణ్, న్యాతరి శివశంకర్, శనిగరపు వెంకటేష్, గంగాధర నగేష్ తదితరులు పాల్గొన్నారు.