Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆలోచన విధానంతోనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి స్ఫూర్తి అంబేద్కర్ రాజ్యాంగం అని కొనియాడారు.
అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలాలు అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ద్వారానేనని అన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజల కోసం కులాలకు, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అందించిన మహానుబావుడు అంబేద్కర్ అని కొనియాడారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో 11.7 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనంలో రూ.146 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందని గుర్తు చేశారు. విగ్రహం చుట్టూ 2.93 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ ఏర్పాటు చేశారని, విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆడియో విజువల్ గది ఏర్పాటు చేశారని, సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి చరిత్ర లో నిలిచి పోయారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.