జూలపల్లి, డిసెంబర్ 17: ‘కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు చేసింది మహాపాదయాత్ర కాదని, ప్రజా వంచన యాత్ర’ అని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఉనికి కోసమే పాకులాడుతున్నాడని విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మండలంలోని తేలుకుంటలో విలేకరులతో మాట్లాడారు. తేలుకుంట నుంచి ఎలిగేడు వరకు చేపట్టిన పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాలు వల్లెవేశాడని దుయ్యబట్టారు. మాయమాటలు చెబుతూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నాడని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కారుపై బురద చల్లితే ఊరుకోబోమని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లు రాత్రివంబవళ్లు కష్టపడి తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. ఇదే కోవలో రూ.6కోట్లు ఖర్చు చేసి తేలుకుంటను అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.2 కోట్లతో కస్తూర్బా స్కూల్లో అదనపు తరగతి గదులు, రూ.1.10 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి పల్లెకు ట్రాక్టర్ ఇచ్చామన్నారు. వైకుంఠధామం, డంప్‌యార్డులు నిర్మించామన్నారు. తీరొక్క మొక్కలతో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఇది గిట్టని విజయరమణారావు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచులు సొల్లు శ్యామ్పద్మ, తొంటి పద్మబుచ్చయ్య, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింగం, నేతలు నేవూరి మల్లేశం, పిల్లి భూమయ్య, చిప్ప రమేశ్, చిప్ప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.