Indian Defence Forces | జగిత్యాల మే 10 : జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాత్రికేయులు శనివారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు.
జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాతను కీర్తిస్తూ, మన రక్షక దళాల వీరత్వాన్ని పొగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా పక్కలో బల్లెంగా మారిన పాకిస్తాన్ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో మార్లు ప్రయత్నం చేసిందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందన్నారు.
శాంతికాముకులైన భారతదేశ ప్రజలు పాకిస్థాన్ కు స్నేహ హస్తాన్ని చాచినప్పటికీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా పదేపదే మన దేశం పైకి దాడులకు తెగబడడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి, మన వీర జవాన్లకు మద్దతు తెలపడం కనీస బాధ్యతగా గుర్తించి జగిత్యాల పాత్రికేయుల పక్షాన సంఘీభావ ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు. దేశ ప్రజలందరూ కుల, మత, ప్రాంత విభేదాలు విడనాడి భారత ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.