జగిత్యాల రూరల్, అక్టోబర్ 31: ‘ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో రావాలని కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు చేస్తున్నది. అన్నీ అబద్ధాలు చెబుతున్నది. ఆరు గ్యారెంటీలంటూ మోసం చేస్తున్నది. అన్నీ ఫేక్ హామీలే. కర్ణాటకలో ఇలాగే గ్యారెంటీలంటూ ప్రజలను నిండా ముంచింది. వాళ్లను నమ్మితే మోసపోతం. జాగ్రత్త’ అంటూ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీని నమ్మితే తెలంగాణ మళ్లీ చీకటవుతుందని, నేనొక్కటే ప్రశ్నిస్తున్నా.. 5గంటలు కరంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? 24గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? ఆలోచించుకోవాలని సూచించారు. జగిత్యాల మండలం చల్గల్లోని కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువకులు 200 మంది వరకు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం వెలుర్ధి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రజల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి ఒక ధీమా అని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రజల నుంచి పైసలు వసూలు చేసిన పార్టీ అని, మనది ప్రజా సంక్షేమ ప్రభుత్వమన్న ఆయన, కడుపులో ఉన్న బిడ్డ నుంచి మొదలు కొని కాటికిపోయే దాకా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మనలాంటి ఒక్క పథకం కూడా వారి పాలిత రాష్ర్టాల్లో లేదని, పింఛన్‌ను సైతం రూ.600 నుంచి రూ.1200కు మించి ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, పథకాలకు ఆకర్శితులయ్యే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరుతున్నారని వివరించారు. పార్టీలోకి వచ్చిన వారు కొత్తపాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి, వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో రెండోసారి బీఆర్ఎస్ ఎగరేయాలన్నారు. ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు దావ సురేష్, ప్యాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైరర్మెన్ ఆసీఫ్, సర్పంచులు గంగనర్సు రాజన్న, బుర్ర ప్రవీణ్, ఉప సర్పంచ్ పధ్మ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ పులిశెట్టి శ్రీనివాస్, నాయకులు మోహన్ రెడ్డ, తోట పోచమల్లు, మహేశ్, మధు, గంగారాం, షకీల్, లక్ష్మణ్, వెంకటేశ్, గంగారాం, శ్రీనివాస్, గంగాధర్, రాకేశ్, శేఖర్, మహిపాల్, అజయ్, ప్రభు, రాజు, హావేజ్ ఉన్నారు.