Godavarikhani | కోల్ సిటీ, మే 26 : ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని బెనిఫిట్స్ చెల్లింపులకు ఒప్పందం కుదిరిందని జేఏసీ నాయకులు తెలిపారు. ఈమేరకు నగర పాలక కార్యాలయంలో కమిషనర్ జే. అరుణ శ్రీతో జరిగిన చర్చల్లో తాము ప్రతిపాదించిన డిమాండ్లకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. గతంలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబాల్లో వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చాలని కోరగా, ఉదయం 4 గం.ల నుంచి 10 గంల వరకు పనివేళలు కుదించినట్లు తెలిపారు.
కార్మికులకు తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని కోరగా, బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపినట్లు పేర్కన్నారు. ఆదివారం, పండుగ సెలవులను అమలు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బట్టలు, సబ్బులు, నూనె, చెప్పులు, బెల్లం, చీపులు, గౌజులు, మాస్కులు మూడు రోజుల్లో ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. రిక్షా కార్మికులకు ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేసే విధానం మార్చి నేరుగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్నట్లుగా వేతనాలు ఇవ్వాలని కోరగా, కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
గత కమిషనర్ ఇచ్చిన పదోన్నతులను కొనసాగించాలని కోరగా, అంగీకరించినట్లు తెలిపారు. నూతన సొసైటీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. బయోమెట్రిక్ పని చేయక నష్టపోయిన మస్టర్లను తిరిగి రికవరి చేస్తామని కమిషనర్ అంగీకరించినట్లు తెలిపారు. కాగా, చర్చల్లో జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్ రావు, ఎంఏ గౌస్, కిషన్ నాయక్, గుంజ రమణ, వేల్పుల రాయమల్లు, రాజేందర్ తోపాటు కార్మికులు పాల్గొన్నారు.