ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది. ఇటీవలి రాజకీయ పరిణామాలతో గందరగోళంగా తయారైంది. నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీలో సేవలందించిన జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి.. అవమానాలను భరించలేక ఆ పార్టీని వీడడంతో కల్లోలం రేగుతున్నది. ఆపైన జీవన్ బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడం, కేటీఆర్ స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం, మరుసటి రోజే కేసీఆర్‌ను కలువడం ఆ పార్టీలో గుబులు రేపుతున్నది.
ఈ నెల 20న జగిత్యాల వేదికగా కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనుండడం, ఆయన వెంటే నాయకులు, కార్యకర్తలు కదులుతుండడంతో ‘హస్తం’ ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన్‌రెడ్డి లాంటి నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుడిని వదులుకోవడం పార్టీకి నష్టమేనని చెబుతున్నారు. నిజానికి సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా అవమానించడంపై మొదటి నుంచి తమ అభ్యంతరాలను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. జీవన్‌రెడ్డి లాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని, అలాగే ఉత్తర తెలంగాణలోనే గుర్తింపు పొందిన రాజకీయ శక్తిని పార్టీ విస్మరించవద్దని కోరుతూ వచ్చినా విస్మరించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి పార్టీలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పట్టున్నది. మొదటి నుంచి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు నియోజకవర్గాల్లోనూ కేడర్ ఉన్నది. పెగడపల్లి మండలం బతికెపల్లికి చెందిన జీవన్‌రెడ్డి, జగిత్యాల నియోజకవర్గ కేంద్రంగా రాజకీయాలు చేశారు. ప్రధానంగా జగిత్యాలతోపాటు ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అనుచరులుగా ఉన్నారు.
గతంలో మల్యాల పంచాయితీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 వరకు మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండడంతో ఆ రెండు మండలాల్లోనూ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మానకొండూర్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ మంచి సంబంధాలు కొనసాగించారు. ఇటీవల జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం రేపింది. ఆయన పార్టీని వీడిన సమయంలోనే వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలుపడం కనిపించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి స్వయంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ‘హస్తం’ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. కేటీఆరే స్వయంగా వచ్చి సాదర స్వాగతం పలుకడంతో జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్లోనూ ప్రాధాన్యం ఉందన్న విషయం తేటతెల్లమై నయాజోష్ కనిపించింది. జీవన్‌రెడ్డి, కేటీఆర్ భేటీ కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది నాయకులు తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, జీవన్‌రెడ్డి అనుచరులు కలిసి గులాబీ దండులా మారిపోయి.. ‘జైతెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. జీవన్‌రెడ్డి వెంటే తాము అన్న సంకేతాలు ఇచ్చారు.
పెద్ద సంఖ్యలో రాజీనామాలు
జీవన్‌రెడ్డి ఆత్మగౌరవానికి భంగం కలిగేలా కాంగ్రెస్ అధినాయకత్వం, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే పెద్దసంఖ్యలో రాజీనామాలు చేశారు. జగిత్యాల పట్టణంతోపాటు నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందులో ఉన్నారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ సింబల్తోపాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన కౌన్సిలర్లు సైతం జీవన్‌రెడ్డి వెంటే నడుస్తామని ఇప్పటికే ప్రకటించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, సభ్యులు సైతం పార్టీని వీడి, జీవన్‌రెడ్డికి జై కొట్టారు. కొడిమ్యాల, మల్యాల మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సైతం జీవన్-కేటీఆర్ భేటీకి హాజరై సంఘీభావం తెలిపారు.
బుజ్జగింపులు.. బెదిరింపులు
జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని, చాలా నియోజకవర్గాల నుంచి కేడర్ పెద్ద ఎత్తున వెళ్లిపోయే ప్రమాదముందని ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కేడర్‌ను నయానో.. భయానో కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంతోపాటు జీవన్‌రెడ్డిపై విమర్శలు కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన వెంటనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టుతో పాటు జగిత్యాల, రాయికల్ మార్కెట్ కమిటీ పోస్టులను భర్తీ చేశారు. డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వారికి ఈ నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. అలాగే జీవన్‌రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తులుగా ఉన్న డీసీసీ అధ్యక్షుడు, బండ శంకర్, కొత్త మోహన్‌తోపాటు కౌన్సిలర్లుగా గెలిచిన పలువురు నాయకులను పార్టీని వీడకుండా చూడడంలో సఫలమయ్యారు.
రానున్న రోజుల్లో మరికొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తామని, ఇతర ప్రయోజనాలు చేకురుస్తామని, పనులు కట్టబెడుతామంటూ తాత్కాలికంగా నిలువరించారు. మరి కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు జీవన్‌రెడ్డితో వెళ్తామని తేల్చిచెప్పగా, వారిపై బలవంతంగా ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడకుండా ఉండాలని జీవన్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జీవన్‌రెడ్డి-కేటీఆర్ భేటీ ఒక వైపు కొనసాగుతుండగానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య తదితరులు ప్రెస్‌మీట్ నిర్వహించి విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలు బూమ్రాంగ్ అయ్యాయన్న చర్చ ఆ పార్టీలోనే కొనసాగుతున్నది.
ప్రజాప్రతినిధుల్లో గుబులు
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతుండడంతో ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరగడం, మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి పనితీరు సరిగ్గా లేకపోవడం, జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆలోచనలో పడ్డారు. రైతు భరోసా ఇవ్వకపోవడం, పెన్షన్ల పెంపు, తులం బంగారం, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేకపోవడం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఇవ్వకపోవడంతో సర్కారు ప్రజల్లో పూర్తిగా పలుచన అయిపోయిందని, ఇలాంటి తరుణంలో జీవన్‌రెడ్డి లాంటి కీలక నాయకుడికి బీఆర్ఎస్ అత్యంత గౌరవం కల్పించి పార్టీలోకి స్వాగతించడం తమకు రానున్న రోజుల్లో తీవ్ర తలనొప్పులను తెస్తుందని భయపడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఆదరణ పెరిగిన సమయంలో రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండి, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న జీవన్‌రెడ్డి గులాబీదళంలో చేరడం హస్తం పార్టీకి తీవ్రనష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మీరు ఎక్కడున్నా నావాళ్లేనంటూ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్‌రెడ్డి అనుచరులు పార్టీ మారకుండా.. జీవన్ వెంట వెళ్లకుండా అడ్డుకునేందుకు ‘హస్తం’ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు జీవన్‌రెడ్డి వెంట నడవడానికి సిద్ధపడి రాజీనామాలు చేసినా, కొందరిని అడ్డుకున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. ఇటీవల చొప్పదండి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మొత్తం మంది కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించుకొని, జీవన్‌రెడ్డి వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాగే వేములవాడ నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన నాయకులు, ధర్మపురి, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల నియోజవకర్గాలకు చెందిన నాయకులు కూడా జీవన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఆ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు పార్టీ మారకుండా ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పెడుతున్న ఒత్తిడి విషయాన్ని జీవన్‌రెడ్డి వద్దకు వచ్చి సహచరులు తెలియజేయగా, ‘బిడ్డా.. మీరు ఎక్కడున్నా నావాళ్లే. అవసరం అయినప్పుడు వద్దురు. అంత ఒత్తిడిని భరిస్తూ ఎందుకు రావడం. మున్ముందు అనేక పరిణామాలు ఉంటయి. మీరు ఎక్కడున్నా నావాళ్లే. మీపై నాకు, నాపై మీకు ప్రేమ ఎప్పటికీ తగ్గదు’ అని చెప్పినట్టు తెలిసింది. అయితే వ్యూహాత్మకంగా జీవన్‌రెడ్డి ఇచ్చిన ఝలక్‌తో కాంగ్రెస్ సైతం బిత్తరపోతున్నట్టు సమాచారం. ‘పదవులు, డబ్బులు, పనులు ఆశపెట్టి ఆపుతున్నాం.. లేదంటే భయపెట్టి ఆపుతున్నాం.. వీరంతా రేపటి రోజున తీరా సమయానికి పుట్టి ముంచుతారా..’ అన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నది.