జగిత్యాల రూరల్, మే 23: అగ్ని ప్రమాదంలో ఈత, తాటిచెట్లు కాలిపోవడం బాధాకరమని, గీత కార్మికులకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈత, తాటి వనాలు పెంచుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదెకరాలు ప్రభుత్వ స్థలాన్ని వారికి కేటాయించాలన్నారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తూ కాలిపోయిన ఈత, తాటి చెట్లను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని సర్వే నంబర్ 437లోని ఐదెకరాల స్థలం గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించాలని కోరారు.
ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక దృష్టిసారించి ఘటనా స్థలాన్ని పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పదెకరాల స్థలం మంజూరు చేయించాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టుషాపులను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీ ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. వైన్‌షాపులు, బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ గీత కార్మికులపై పెడితే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో నాయకులు, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.