Jagtial SP Ashok Kumar | కోరుట్ల, జనవరి 10: కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు.
విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని, ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంచుకోవాలని, ముఖ్యంగా యువతకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు సూచించారు. ఎస్పీ వెంట మెట్ పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల, మెట్పల్లి సీఐలు సురేష్ బాబు, అనిల్ కుమార్, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు.