జగిత్యాల, సెప్టెంబర్ 3, (నమస్తే తెలంగాణ): ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని, ఇందిరమ్మ ఇండ్లలో బరాబర్ ఓట్లడుగుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లలో ఓటు అడిగే హకు బీఆర్ఎస్కు లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించడం అర్థరహితమని, అసంబద్ధమన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుడు తన వాటాతో పాటు, రుణాన్ని తీసుకున్నారని గుర్తు చేశారు.
ఆ రుణంతోపాటు, లబ్ధిదారుడి వాటాను సైతం 2014లో చెల్లించలేని పరిస్థితిలో ఉండగా, తెలంగాణ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, రూ.4 వేల కోట్ల హౌసింగ్‌లోన్ పద్దును రద్దు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్పును రద్దు చేయడంతో ప్రతి ఇంటి నిర్మాణంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాగస్వామ్యం, హక్కు ఏర్పడిందన్నారు. ఇది మరిచిపోయి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లలో బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కులేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయ న, తన రాజకీయ జీవితాన్ని ఇందిరాగాంధీని, కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే ఆరంభించారని గుర్తు చేశారు. 1983, 1989 నుంచి 1994 వరకు, 2004 నుంచి 2014 వరకు తన హయాంలో జగిత్యాలలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాలు, దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాం లో దళితులకు జరిగిన మేలేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు, పలు అంశాల్లో దళితులకు ప్రాధాన్యత ఇస్తున్నది బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పారు. మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లు కల్పించామని, అలాగే మద్యం దుకాణాల్లోనూ రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. దళితబంధుతో దళితుల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దళిత సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న బీఆర్ఎస్ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు, ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి లేవన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని జీవన్‌రెడ్డి అడగడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన రూ.75 వేల కోట్ల రైతుబంధులో 80 శాతం లబ్ధిదారులు బీసీ, ఎస్సీ వర్గాల వారే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రైతు రుణమాఫీ వల్ల ఆయావర్గాలకు మేలు జరిగిందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో ఎక్కువగా ప్రయోజనం పొందింది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారేనని తెలిపారు. చేనేత, మత్స్య, యాదవుల మేలు కోసం చర్యలు తీసుకున్న ఘనత బీఆర్ఎస్ సర్కార్కే చెందుతుందన్నారు. చేనేత కార్మికులను 60 ఏండ్లుగా కాంగ్రెస్ పాలకులు మోసం చేయడంతో బతుకుదెరువు కోసం బొంబాయి, సూరత్ వంటి ప్రాంతాలకు వెళ్లడంతో చేనేత కుటుంబాల ద్వారా బీడీ తయారీ పరిశ్రమ తెలంగాణలోకి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం బీడీ కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకున్నారన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఆలోచించిందా? అని ప్రశ్నించారు.
వారి పరిస్థితులను చూసి చలించిన ఎమ్మెల్సీ కవిత జీవన భృతిని ప్రవేశపెట్టాలని కోరగా, నెలకు రూ.2వేల పెన్షన్‌ను ప్రభుత్వం అందిస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యంపై ఆధారపడి ఉందని జీవన్‌రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. మద్యం వ్యవస్థను పెంచిపోషించింది కాంగ్రెస్‌నేనని మండిపడ్డారు. గతంలో జీవన్‌రెడ్డి స్వయంగా ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారని, అప్పుడు ఎందుకు మద్యం వ్యవస్థను బంద్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు మద్యం తాగడం లేదా? అని ప్రశ్నించారు. మద్యం తాగమని సోనియాగాంధీపై ఒట్టుపెట్టుకుంటారా? అని నిలదీశారు. రాష్ట్రంలో మైనార్టీలతో పాటు, బడుగు, బలహీనవర్గాలు, ఇందిరమ్మ కాలనీల్లో ఓట్లు అడిగే పేటెంట్ హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఒల్లెం మల్లేశం, బాలె శంకర్, దుమాల రాజ్‌కుమార్, జుంబర్తి శంకర్, చెట్పల్లి సుధాకర్ పాల్గొన్నారు.