మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 14 : జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నదని సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనను అంతమొందించేందుకు ఈ సభ వేదిక కాబోతున్నదని చెప్పారు. ప్రజలందరూ ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి పదిహేను వేలకు తగ్గకుండా జన సమీకరణ చేపట్టి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మంగళవారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్‌లో పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం అవుతుందని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రభుత్వ పాలన రోజుకో స్కాంగా మారి దొరికినంత దోచుకో.. దాచుకో అన్న చందంగా తయారైందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్కాములపై పడ్డాడని ఆరోపించారు. భూ కబ్జాలు, సింగరేణి మైనింగ్లను అయిన వాళ్లకు కట్టబెడుతున్నారని, అంగన్వాడీలకు ఇచ్చే ఫోన్లలో అవినీతి చేశారని విమర్శించారు., ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని, కేటీఆర్‌పై ఐదు కేసులు పెట్టారని, ప్రశ్నిస్తున్న హరీశ్‌రావుతో పాటు తనపై కేసులు పెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రమణ, మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు మారు సాయిరెడ్డి, దారిశెట్టి రాజేశం, సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తోట శ్రీనివాస్, ఎల్లాల దశరత్‌రెడ్డి, రమేశ్, పూదరి సుధాకర్‌గౌడ్, ఫయ్యుం, కాటిపెల్లి ఆదిరెడ్డి, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ర్టానికి ఒక కొత్త వెలుగు
రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి పాలసీ లేదు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహాయిస్తే ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ప్రజలను అన్ని రకాలుగా వంచించింది. జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుంది. జగిత్యాల సభతో రాష్ర్టానికి ఒక కొత్త వెలుగు రాబోతున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా జన సమీకరణ చేయాలి. కేసీఆర్ సభను విజయవంతం చేయాలి.
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే
సభను జయప్రదం చేయాలి
జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలి. పెద్ద సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలి. కోరుట్ల నియోజకవర్గంలోని 250 బూత్‌ల నుంచి 15వేలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. కానీ, కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నరు. ఎవరూ అధైర్యపడొద్దు. మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సే.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు