Jagityala Municipality | జగిత్యాల, ఆగస్టు 22 : పారిశుధ్య నిర్వహణలో జగిత్యాల మున్సిపాలిటీ విఫలమైందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. ఆమె శుక్రవారం జగిత్యాలలోని గోవిందుపల్లె ఆరో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీలు తీయక, ఇంటింటికి చెత్త సేకరణ జరగక జగిత్యాల మున్సిపాలిటీ ఒక మురికి కూపంగా మారిందని వాపోయారు. పట్టణంలో శానిటేషన్ జరగక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వనికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు.
6వ వార్డ్ లో రోడ్లు గానీ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గోవిందుపల్లె వాగు బారి వర్షాలు కురిస్తే వరదలతో వాగు మునిగిపోయి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అన్నారు. వాగు పక్కనే మంచి నీటి బావి ఉండటం వల్ల మంచి నీళ్లు కలుషితమై తాగడానికి వీలు లేకుండా ఉందని, స్నానాలు చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వాపోయారు.
వాగులో జంతు కళేబరాలు, ఇండ్లలోని చెత్త, చికెన్ సెంటర్ లోని వ్యర్ధాలు వాగులో వేయడం వల్ల వాగు కలుషితమై వాగు నీళ్లు మోతే చెరువులో కలవడం వల్ల మోతే చెరువు కూడా కలుషితం అవుతుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాగులో ఎలాంటి చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతల గంగాధర్, నీలి ప్రతాప్, ప్రణయ్, మొగిలి శ్రీను, సంపత్, కరుణాకర్ రాజు, రమేష్, నరేష్, భూమేష్, తిరుపతి, మోహన్ క్రిష్ణ, హర్షిత్, మణిదీప్, లక్ష్మీ, శారద, రాజమణి తదితరులు పాల్గొన్నారు.