Jagityal | జగిత్యాల , ఏప్రిల్ 25: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధంగా ఉన్నామని జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్హామా ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 27న చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు.
ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని, జగిత్యాల జిల్లా నుండి 20వేల మంది తరలి వెళ్తున్నామని చెప్పారు. ఇందుకోసం బస్సులు, కార్లు, వాహనాలు సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ ని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని, 15 నెలల దుర్మార్గపు పాలన, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదనీ, ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27న బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.
దావ వసంత మాట్లాడుతూ 25 వసంతాలు పూర్తి చేసుకొని 27న రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలు, వాకర్స్ అసోసియేషన్ కలిశామని, జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవిత ఇటీవల జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. వారి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో సమన్వయo చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5వేల తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం పట్టణ, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, జగిత్యాల రూరల్, సారంగాపూర్, రాయికల్, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తెలు రాజు, బర్కాం మల్లేష్, రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహేష్, మాజీ ఎంపీపీ సాయి రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు వొళ్ళేం మల్లేశం, నాయకులు దామోదర్ రావు, సమిండ్ల శ్రీను, శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు, రాజేష్, సందయ్య, హరీష్, ప్రతాప్, సన్నిత్ రావు, మధు, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.