జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 28: ‘ నేను ఈ ప్రాంత బిడ్డను. మీ వెంటే ఉంటా.. కష్టాల్లో తోడుంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటా. మళ్లీ ఆశీర్వదించండి. జగిత్యాలను మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని బూసి లక్ష్మీనారాయణ గార్డెన్లో శనివారం నిర్వహించిన జగిత్యాల నియోజకవర్గ పురగిరి క్షత్రియ(పెరుక)ల ఆత్మీయ సమ్మేళనానికి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.
రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌తో కలిసి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 2014లో తొలిసారి ఓడిపోయినా, 2018లో ఎమ్మెల్యేగా గెలిచినా.. అప్పుడూ, ఇప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆరే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారన్నారు. గడిచిని తొమ్మిదేండ్లలో నియోజకవర్గానికి తొమ్మిది గురుకుల పాఠశాలలను తీసుకువచ్చానని, దీంతో ఎంతో మంది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు కార్పొరేట్‌కు ధీటుగా విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలో పెరుకలకు సంఘ భవనానికి స్థలాన్ని తప్పకుండా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
కామారెడ్డి అసెంబ్లీ సీటును సీఎం కేసీఆర్ కోసం గంప గోవర్దన్ త్యాగం చేయడంతో పెరుకలు త్యాగానికి ప్రతిరూపకంగా నిలిచారని ఎమ్మెల్సీ ఎల్. రమణ కొనియాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెరుకలంతా కారు గుర్తుకు ఓటు వేసి డా. సంజయ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఇటీవలే నూతనంగా ఏర్పాటైన పెరుక సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు.
ఇక్కడ గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ డా. చంద్రశేఖర్‌గౌడ్, పెరుక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల ముకుందం, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నక్కల రవీందర్‌రెడ్డి, పెరుక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి, ఉపాధ్యక్షులు కట్ట రాజేందర్, సర్పంచులు బొడ్డు దామోదర్, అంకతి మల్లయ్య, నల్లపు తిరుమల్, ఉప సర్పంచ్‌లు బుచ్చన్న, రమేష్, సంఘ నాయకులు మంచాల అంజి, మీస వేణుగోపాల్, మహేశ్, మంచాల శ్రీనివాస్, ధర్మరాజు, బొడ్డు గంగాధర్ పాల్గొన్నారు.