మెట్పల్లి రూరల్, ఆగస్టు 23: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌పై నుంచి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని దొంగలమర్రి వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మకూర్ పెద్దవాగు నుంచి బండలింగాపూర్ వైపు అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మనగర్‌కు చెందిన దండ్ల రవి నడుపుతున్న ట్రాక్టర్లో అతని గ్రామానికి చెందిన నర శేఖర్(27) డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఈ క్రమంలో రవి ఫోన్ మాట్లాడేందుకు స్టీరింగ్‌ను శేఖర్‌కు అప్పగించే ప్రయత్నం చేయగా, అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కారణంగా అతను ట్రాక్టర్‌పై నుంచి కింద పడిపోయాడు. వెనుక చక్రం శరీరంపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.