కోరుట్ల, మార్చి 4 : కోరుట్లలో చెత్త నుంచి సేంద్రీయ ఎరువుల తయారీకి అడుగులు పడ్డాయి. బయో మైనింగ్ యంత్రం(Biomining) సాయంతో చెత్తను శుద్ధి చేసే ప్రక్రియను ఇటీవల అధికారులు ప్రారంభించారు. బయో మైనింగ్ యంత్రంతో వ్యర్థాలు వివిధ దశల్లో శుద్ధి తర్వాత చివరగా వచ్చే బయో ఎరువు జీవ ఎరువుగా వినియోగించేందుకు బల్దియా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
బయో మైనింగ్ చెత్త శుద్దీకరణ యంత్రం ఏర్పాటు
కోరుట్లలో చెత్త సమస్యకు మార్గం సుగమమైంది. పట్టణంలోని కల్లూరు రోడ్డులో 5.50 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల భాగస్వామ్యంతో రూ.2.97 కోట్లతో బయో మైనింగ్ చెత్త శుద్దీకరణ యంత్రాన్ని నెలకొల్పారు. కోరుట్లలో లక్షపై చిలుకు జనాభా కలిగి, 22, 115 వేల నివాస గృహలు, 1038 వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండగా నిత్యం 34.25 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. చెత్తను పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో నిల్వ ఉంచడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా చెత్త శుద్దీకరణను ప్రణాళికలు తయారు చేశారు. ఎట్టకేలకు ఇటివల బల్దియా అధికారులు బయో మైనింగ్ ఏర్పాటు చేయడంతో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. బయో మైనింగ్ ద్వారా ఇప్పటికే చేత్త శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. ఈ చెత్త శుద్ధి ద్వారా వచ్చే జీవ ఎరువు బయో ఎర్త్ పంటలకు ఎరువుగా పనికి రావడంతో బల్దియా అధికారులు పరీక్షల కోసం ఎరువును ప్రయోగశాలకు పంపారు. ఫలితాల విశ్లేషణ అనంతరం బయో మైనింగ్ ద్వారా వెలువడే జీవ ఎరువును రైతులకు ఉచితంగా అందించనున్నారు.
వివిధ దశల్లో చెత్త శుద్ధీకరణ ప్రక్రియ
హైదరాబాద్కు చెందిన అన్నపూర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ చెత్త శుద్ధీకరణ పనులు చేపడుతోంది. 100 ఎంఎం కన్నా తక్కువ పరిమాణం గల వ్యర్థాలు అంటే పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాటిల్స్, దుస్తులు లాంటివి మొదటి దశలో బయటకు వస్తాయి. రెండవ దశలో చిన్న సైజు ఉండే వ్యర్థాల వేరు కాబడుతాయి. ఇలా వివిధ దశల్లో వచ్చే వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేస్తారు. 8 ఎంఎం కన్నా తక్కువ పరిమాణం గల వ్యర్థాలు చివరకు సేంద్రియ ఎరువుగా మారుతాయి.
ఎరువును రైతులు పంట పొలాల్లో ఉపయోగించవచ్చు
చెత్తను నాలుగు దశలుగా విభజించి శుద్ధి చేస్తారు. చివరి అవుట్ పుట్ 8 ఎంఎం కన్నా తక్కువగా ఉంటుంది. దీన్నే బయో ఎర్త్ అంటారు. పంట పొలాల్లో ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. డంపింగ్ యార్డులో మొత్తం 65,103 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంది. ఇప్పటి వరకు 27790 మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా వేరు చేయగా, 12499 మెట్రిక్ టన్నుల బయో సాయిల్ (ఎరువు) తయారు చేశామని
మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి తెలిపారు.