కోరుట్ల, ఆగస్టు 18 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన ఓ ఇల్లు పై కప్పు కూలి పాక్షికంగా దెబ్బతిన్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బెండపల్లి కాలనీకి చెందిన అబ్దుల్లా లతీఫ్ కుటుంబం పెంకుటింట్లో నివసిస్తుంది. సోమవారం అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. అదే సమయంలో పక్కింట్లో ఓ గదిలో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా కూలిపోయిన ఇంటి శిథిలాలు పక్కనే ఉన్న జుబేర్ ఇంటిపై పడడంతో రేకుల షెడ్డు పాక్షికంగా దెబ్బతింది.
ఈ ఘటనలో ఇరు కుటుంబాలకు కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న కమిషనర్ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలను పునరావస కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించారు. బాధిత కుటుంబాలకు భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. కాగా, అదే కాలనీలో శిథిలావస్థకు చేరిన మరో రెండు ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. భారీ వర్షాలతో శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని కమిషనర్ సూచించారు.