కోరుట్ల, ఫిబ్రవరి 26 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోరుట్లలో అగ్రికల్చరల్ విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చరల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని వేములవాడ రోడ్డు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు సంవత్సరాలుగా హాస్టల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో రెండే బాత్రూంలు ఉన్నాయని తెలిపారు.
బాత్రూములకు తలుపులు కూడా లేవన్నారు. కళాశాలలో బోధించేందుకు సరైన ఫ్యాకల్టీలు లేరని, యూనివర్సిటీ గుర్తింపు ఉందో లేదో అని అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. సెమిస్టర్ పరీక్ష పేపర్లు యూనివర్సిటీ నుంచి రావలసి ఉండగా ఇక్కడే అధ్యాపకులు తయారు చేసి మార్కులను కరెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో జూనియర్ విద్యార్థులు చేరడం లేదని చెప్పారు. విద్యాబోధన సరిగా లేకపోవడంతో మార్కులు తక్కువగా వస్తున్నాయని తమకు డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులకు సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
పాత బిల్డింగ్ లో సరైన సౌకర్యాలు లేవని కొత్తగా బిల్డింగు నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలి లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుమారు రెండు గంటల పాటు వేములవాడ రహదారిపై విద్యార్థులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్కడికి చేరుకొని విద్యార్థులను సముదాయించి కళాశాల గేటు ఎదుట నిరసన తెలుపుకోవాలని సూచించారు. దీంతో విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు.