వెల్గటూర్, జనవరి 13 : సంక్రాంతి సందర్భంగా కొత్తపేట గ్రామ సర్పంచ్ జిరెడ్డి మహేందర్ రెడ్డి ముగ్గుల పోటీల విజేతలకు విలువైన బహుమతులు అందించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో 33 మంది మహిళలు పాల్గొనగా మొదటి బహుమతి గెలుపొందిన నాయిని రమ్యకు 9 తులాలు వెండిని ఆయన బహూకరించారు. రెండవ బహుమతి పొందిన గంగదరి జయశ్రీ కి 6 తులాలు, మూడో స్థానం లో నిలిచిన కొత్తపల్లి స్వప్న కు 4 తులాల వెండిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి మహిళ కాపాడాలని ఆకాంక్షించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాన్సోలేషన్ ప్రైజ్ ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింహరాజు లక్ష్మీకాంతం, కదారి శ్యామల, తరల్ల రవి, గోనే గంగారెడ్డి, బూరగడ్డ సంతోష్, కుషణపల్లి రాయమల్లు, కార్యదర్శి గోమతి, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, స్వప్న, నవనీత, ఆశలు, సిఏ లు తదితరులు పాల్గొన్నారు.