కోరుట్ల, ఫిబ్రవరి 19 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు(Government school students) అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ లోని విద్యా మంత్రిత్వ శాఖ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోని పాఠశాల విద్యార్థులకు గొప్ప భారతీయ వారసత్వం అంశాలపై థీమ్ ఆధారిత పోటీలను నిర్వహించింది. ఈపోటీల్లో కోరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 6,7వ తరగతి విద్యార్థినిలు భారత దేశ ప్రాచీన క్రీడా కబడ్డీని ఎంచుకున్నారు.
తాము ఆడిన కబడ్డీ క్రీడా పోటీల విడియో డాక్యుమెంట్స్‌ను భారతీయ కేల్ వెబ్సైట్లో పొందుపర్చారు. విద్యార్థినిలు అప్లోడ్ చేసిన కబడ్డీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా అత్యధిక ప్రశంసలు దక్కించుకుంది. ఇందులో భాగంగా కబడ్డీ క్రీడలో పాలుపంచుకున్న 14 మంది విద్యార్థినిలకు విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం పోస్ట్ ద్వారా క్రీడా పరికరాలను బహుమతిగా పంపించింది. డాక్యుమెంట్ రూపకల్పనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మోహన్ రావు అభినందనలు తెలిపారు.