పెగడపల్లి : విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే..పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన ఐలవేణి రంజిత్ కుమార్(16 ) ప్రస్తుతం పెగడపల్లి మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం స్కూల్ కి వెళ్లి మధ్యాహ్నం సమయంలో స్కూల్ నుంచి తన స్నేహితుడి బైక్ పై ఇద్దరు పెగడపల్లి వస్తుండగా.. మార్గమధ్యంలో సబ్స్టేషన్ వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు.
ఇదే సమయంలో కరీంనగర్ తీగల గుట్టపల్లికి చెందిన నవీన్ కుమార్, ఆరేపల్లి అనిల్, గసిగంటి వర్ధన్, మైస అజయ్ అనే నలుగురు వ్యక్తులు తెలుపు రంగు (TS 09 EP 4569) కారులో వచ్చి నవీన్ కుమార్ కి చెందిన పెంపుడు కుక్కని రంజిత్ కుమార్ దొంగిలించాడనే అనుమానంతో బలవంతంగా వారి కారులో ఎక్కించుకొని కరీంనగర్ వైపు బయలుదేరారు. శివరాత్రి శివ ఈ సమాచారాన్ని రంజిత్ కుమార్ బంధువులకు చేరవేశాడు. రంజిత్ కుమార్ తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోనే ఎస్సై సీహెచ్ రవికిరణ్, సిబ్బంది కిడ్నాపర్స్ను అరెస్టు చేసి కారుని సీజ్ చేశారు. అనంతరం బాలుడు రంజిత్ కుమార్ ని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పినట్లు పోలీసులు తెలిపారు.