సారంగపూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Ambedkar )విగ్రహానికి చెప్పుల దండతో అవమానించడమంటే కుల అహంకారంతో విర్రవిగే వారి వల్లేనని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. ఆదివారం సారంగపూర్ మండలం నాగునూర్‌లో అవమానానికి గురైన అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించిన పేట భాస్కర్ సంఘ నాయకులతో కలిసి విగ్రహనికి పాలభిషేకం చేసి పూల దండలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అక్కసుతో కుల అహంకారులు ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని వారు ఎంతటి వారైన దేశ ద్రోహం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహానీయుల విగ్రహాలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ఎవుసం గంగాధర్, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఎలిశెట్టి గంగారెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల రాజు, మండల అధ్యక్షుడు పుడూరి శోభన్, జిల్లా నాయకులు శనిగారపు రాజేష్, జాగర్ల రాజయ్య, స్థానిక నాయకులు మచ్చ జగన్, రాహుల్, వంశీ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.