కోరుట్ల, ఆగస్టు 5: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని విద్యార్ధులు ఇష్టపడి చదివి ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటూ మండలంలోని మాదాపూర్, మోహన్ రావు పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్యే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యాసంస్థల్లో తరగతి గదులు, పరిశుభ్రత, విద్యార్ధుల హజరు, ఉపాధ్యాయుల బోధన విధానంపై ఆరా తీశారు. మాదాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్ణేతలని కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉన్న ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చదువుపై ధ్యాస ఉంచాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పర్చుకొని మంచి సాధనతో చదువుల్లో రాణించాలని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కష్టాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. ఏ సమస్య ఉన్న నిర్భయంగా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకు వెళ్లాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, నాణ్యతో కూడిన భోజనం, మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బరోసా కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, బీఆర్ఎస్ నాయకులు పొట్ట సురేందర్, జాల వినోద్ కుమార్, సజ్జు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.