కోరుట్ల, సెప్టెంబర్ 23: ఒక దశ, దిశ లేకుండా కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఎవరికివారే మాయమాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14ఏళ్లు ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా, 20 నెలలకాలంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడిందన్నారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని నిర్దిష్టమైన పాలసీ లేకుండా ఇష్టరీతిలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో ఏనాడు రైతులకు ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం, సాగు రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రగతి అదోపతాలనికి దిగజారింది అన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదని పేర్కొన్నారు. ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగ యువత అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతరం పట్టణంలోని ఏసుకొని గుట్ట దుర్గామాత ఆలయ దసరా నవరాత్రోత్సవాల పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఫహీం, ఉపాధ్యక్షుడు అస్లాం ఖురేషి, నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, పేర్ల సత్యం, సజ్జు, అన్వర్, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహమ్మద్ అతిక్, చిత్తరి ఆనంద్, పొట్ట సురేందర్, వన తడుపుల అంజయ్య, గెల్లే గంగాధర్, శ్రీపతి, బింగి సంతోష్, అమెర్, రాజశేఖర్, రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.