మెట్పల్లి : మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దాం అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కుప్పలను పరిశీలించారు. మార్కెట్లో పలుకుతున్న ధరలను రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రైతులు చేపట్టిన మహా ర్యాలీ ధర్నాకు రాజకీయాల అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో రైతులకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్న నాయకులను నిలదీయాలన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా బోర్డుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం నిధులు కేటాయించలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. రైతు సమస్యలపై తాను కోరుట్ల నుంచి జగిత్యాల వరకు చేపట్టిన పాదయాత్రకు మించి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి మహా ర్యాలీ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.