karimnagar Lrs | కార్పొరేషన్, ఏఫ్రిల్ 24 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ఫైల్స్ క్లియరెన్స్ కరీంనగర్ నగరపాలక అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరపాలక ప్రత్యేకాధికారి, ఉన్నతాధికారులు ఎవ్వరు పట్టించుకోకపోవటంతో అధికారులకు, ఉద్యోగులు అడ్డుఅదుపు లేకుండా వసూళ్ల పర్వానికి తెరలెపారు.
వివిధ సాంకేతిక సమస్యల పేరుతో దరఖాస్తుదారుల నుంచి వేలల్లో ముడుపులు వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహరంలో అధికారుల చేతి మట్టి అట్టకుండా టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్మెన్లు, వార్డు ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉన్న కాంట్రాక్టు సిబ్బంది దోపిడికి తెగపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించి నెలలు గడిచిపోతున్న దరఖాస్తుదారులకు మాత్రం ప్రొసిడింగ్స్ అందటం లేదు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులను కలిస్తే సాంకేతిక సమస్యల పేరుతో దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టు తిప్పుతున్నారు. ముడుపులు ఇస్తే కానీ ఫైల్స్ క్లియరెన్స్ కావటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ముట్టజెప్పితేనే ఫైల్ ముందుకు
అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ ఫైల్స్‌ను వేగంగా క్లియరెన్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల్లో 25 శాతం రాయితీని కల్పించింది. ఈ గడువు మార్చి 31తో ముగిసినా ఈనెలాఖరు వరకు పోడగిస్తూ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇదే అధికారులకు కాసులు దండుకొవటానికి అవకాశంగా మారింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ముందుగా టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్‌స్పెక్టర్లు (ఎల్ 1) అధికారి క్షేత్రస్థాయిలో వెళ్లి స్థలం వివరాలు, దరఖాస్తుదారుల వివరాలను సంబంధింత యాప్‌లో అన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి.
కానీ ఇప్పుడు ఈ పనిని కొందరు అధికారులు తమ కింద ఉన్న చైన్మెన్లకు అప్పగించారు. వీరు ప్రతి దరఖాస్తుకు కనీసంగా రూ. 5 వేలు ముట్టజెప్పితే కానీ క్షేత్రస్థాయిలోకి రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వెళ్లితే ఎంతో కొంత ముట్టజెప్పాలని డిమాండ్లు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఫీజులు చెల్లించిన వారికి కూడ నెలల తరబడిగా ప్రొసీడింగ్స్ అందడం లేదు. వీటిల్లో సాంకేతిక సమస్యల పేరుతో అధికారులు ఫైల్స్‌ను పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో అన్లైన్లో డబ్బులు చెల్లించేందుకు దరఖాస్తుదారులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న పలువరు వార్డు ఆఫీసర్ల అసిస్టెంట్లు మేము ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పనులన్ని పూర్తిచేస్తామంటూ రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తూ దోపిడీ చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
ముఖ్యంగా నగరంలోని తీగలగుట్టపల్లి, రేకుర్తి ప్రాంతాల్లోని ఈ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ దందా జోరుగా సాగిస్తున్నారని, వీరికి టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు, లైసెన్స్ ఇంజనీర్లు కుమ్ముకై ఈ వ్యవహరం నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఫైల్స్‌ను కమిషన్లు ముడితే తప్ప సాఫీగా ప్రొసీడింగ్స్ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముడుపులు ఇవ్వకపోతే పలు అన్లైన్ సమస్యల పేరుతో దరఖాస్తులను పెండింగ్‌లోనే ఉంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి.
కార్యాలయంలో కానరాని అధికారులు.. పట్టించుకోని ఉన్నతాధికారులు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. ఇప్పటికి ఇంకా రెండు వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించిన వారికి ప్రోసిడింగ్స్ అందడం లేదు. వీరికి గడువు ముగిసిన తర్వాత ప్రొసీడింగ్స్ అందుతాయా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైన కరీంనగర్ నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగ ఉన్నతాధికారులు, టీపీఎస్‌లు, టిపీబీఓలు ఎవ్వరు సాయంత్రం వరకు కార్యాలయం వైపు కన్నెత్తి కూడ చూడటం లేదు.
ఎంత సేపు క్షేత్రస్థాయిలో పర్యటన పేరుతో కార్యాలయం వైపు రావడం లేదు. సాయంత్రం వచ్చిన సాంకేతిక సమస్యలతో వచ్చే దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఒకటి, రెండు ఫైల్స్‌ను పరిశీలన పేరుతో సమయం అయిపోయిందంటూ వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహరాన్ని పర్యవేక్షణ చేయాల్సినా నగరపాలక ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారి ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ఎన్ని ఆరోపణలు వస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ఇద్దరు, ముగ్గురు అధికారులైనా కార్యాలయంలో ఉంచకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎల్ఆర్ఎస్లో సాంకేతిక సమస్యల పేరుతో సాగుతున్న ఈ దోపిడి పర్వంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు.