Kondagttu Fire Accident : కొండగట్టులో అగ్ని ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)కు ఫిర్యాదు చేశారు ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని (Rama Rao Immaneni). ప్రభుత్వ వైఫల్యమే కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అగ్నిమాపక సిబ్బంది రాక ఆలస్యం కారంణంగా అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కవైందని.. భాదితులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు రామారావు.
అంతేకాదు తక్షణమే బాధితులకు తాత్కాలిక పరిహారం ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారాయన. అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్‌ను జగిత్యాల జిల్లాకు.. ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజిన్, సిబ్బందిని కేటాయించాలంటూ న్యాయవాది రామారావు కోరారు. అతడు దాఖలు చేసిన పిటిషన్ ను 27572/ఇన్/2025గా నమోదు చేసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ సత్వరమే విచారణ చేపట్టనుంది.
నవంబర్ 29 శనివారం రాత్రి 11 గంటల కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 30 దుకాణాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ప్లాస్టిక్ ఆటవస్తువులు, బొమ్మలు ఇతర సామగ్రి కాలిపోయాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తుంటే, తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనతో బాధితులు బయటకు పరుగులు తీశారు. మొదటి దుకాణంలో మంటలు అంటుకున్న సమయంలోనే ఫైర్ ఇంజిన్‌కు, 108 కు సమాచారం ఇచ్చారు. కానీ, జగిత్యాల నుండి బయలుదేరిన ఫైర్ ఇంజిన్ మధ్యలోనే ఆగిపోయింది. మరో ఫైర్ ఇంజిన్ మెషినరీ మొరాయించడంతో కోరుట్ల, కరీంనగర్ నుండి ఫైర్ ఇంజిన్లను తెప్పించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.