జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 28: నిరుపేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సీఎం సంకల్పంతోనే పేదవారికి సొంతింటి కల సాకారమవుతున్నదని, సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఉద్ఘాటించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో రూ.కోటి వ్యయంతో నిర్మించిన 20డబుల్ బెడ్రూం ఇండ్లను వారు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణంలో 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. చల్గల్ వ్యవసాయాధారిత ప్రాంతమని, ఆసరా పింఛన్ల ద్వారా గ్రామానికి నెలకు రూ.30లక్షలు వస్తున్నాయన్నారు.
గ్రామంలోని 133 మంది రైతులకు రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.7.5కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, గతంలో వారు రాష్ర్టాన్ని ఏండ్లకాలం పాలించినా నిధులు తెచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గృహప్రవేశం చేసిన ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రాజేంద్ర రసాద్, సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ నవీన్, ఎంపీడీవో రాజేశ్వరి, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు రవీందర్ రెడ్డి, శంకర్, ఉప సర్పంచ్ పద్మాతిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీల ఫోరం మహేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు శేఖర్, సోహెల్, షకీల్, ఆసిఫ్, రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.