Jagityal | జగిత్యాల, మే 30 : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీఎస్ లత మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతీ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
ఫ్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల వద్ద ఏఎన్ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర తాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రొటోకాల్ ప్రకారం ప్రతీ ఒక్కరికీ అందాలని అన్నారు.
జగిత్యాలలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు, వివిధ జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.