పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో చేపడుతున్న ఇంటి అక్రమ నిర్మాణంపై మంగళవారం గ్రామస్తులు స్థానిక మండల పరిషత్లో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొన్ని ఏండ్ల క్రితం ప్రభుత్వం లే అవుట్ చేసి, నివాస గృహాలు నిర్మించింది. కాగా, కాలనీ అవసరాల కోసం వదిలిపెట్టిన భూమిలో కల్లెపల్లి తిరుపతి, కల్లెపల్లి సాయిలు అను వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు.
వెంటనే నిర్మాణ పనులు ఆపివేయాలని కోరుతూ గ్రామ అంబేడ్కర్ సంఘం సభ్యులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆరెల్లి గంగయ్య, అంబేడ్కర్ సంఘం సభ్యులు వడ్లూరి పెద్ద లింగయ్య, ఎల్కటూరి రవి, నర్సయ్య, రాజయ్య, జగన్, అనిల్, అంజయ్య, దేవయ్య, భూమయ్య, మొండయ్య తదితరులున్నారు.