MLA Kalvakuntla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 28: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల సమ్మెకు ప్రభుత్వం ఆటంకాలు కల్గించడం దుర్మార్గమని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
కోరుట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ఆవరణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి నేలపై బైఠాయించిన ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు.
ఆ డబ్బులు ఇప్పుడు ఏమాయ్యాయి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడిన మాటలను ఆయన వినిపించారు. ఆర్టీసీకి వ్యాట్ ద్వారా రూ.850 కోట్లు ఆదాయం వస్తుందని, వందలాది కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఆ డబ్బులు ఇప్పుడు ఏమాయ్యాయని ప్రశ్నించారు. ఆర్టీసీకి వస్తున్న ఆదాయం కాకులు ఎత్తుకుపోయాయా.. ? లేక గాంధీభవన్లో దాచి పెట్టారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి, జీవో ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నమ్మించి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను అమలు చేసేందుకు కాంగ్రెస్ నేతలకు చేతులు రావడం లేదని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతా..
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ సంస్థకు ఇవ్వాల్సిన రూ. 3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. నిధులు లేక కార్మికులకు దక్కాల్సిన డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక పోతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆర్టీసీ కార్మికులకు తాను అండగా నిలబడతానని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు వేసుకున్న టెంట్ ను పోలీసులు తొలగించడంపై ఎస్పీతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల కోసం తాను న్యాయపోరాటం చేస్తానని కార్మికులకు ఎమ్మెల్యే బరోసా నిచ్చారు. మండుటెండలో చెట్లకింద నిరసన తెలుపుతున్న కార్మికులకు సంఘీభావంగా గొడుగులను అందించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video