Bonala celebrations | సుల్తానాబాద్, జూలై 19 : ప్రతీ ఇంటా అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ తో పాటు పాఠశాల గ్రూపుల కెప్టెన్ వైస్ కెప్టెన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విద్యార్థులతో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగగా నిలుస్తున్న బోనాల పండుగకు విశిష్టత కలిగి ఉందని, ఈ పండుగలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. దుర్గాదేవి మాతకు ముందుగా పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
అలాగే పాఠశాలలో నాలుగు గ్రూపులకు నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన కెప్టెన్ వైస్ కెప్టెన్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించి గెలుపొందిన వారికి బ్యాడ్జీలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో కెప్టెన్లు వైస్ కెప్టెన్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల వేడుకలు అంబరాన్నంటాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.